సినిమా : కేసరి చాప్టర్ 2 – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్
నటీనటులు : అక్షయ్ కుమార్, రెజీనా కసాండ్రా, ఆర్ మాధవన్, అనన్య పాండే
దర్శకుడు : కరణ్ సింగ్ త్యాగి
సంగీతం : శాశ్వత్ సచ్‌దేవ్
నిర్మాత : కరణ్ జోహార్
Kesari Chapter 2: The Untold Story of Jallianwala Bagh Review : అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ‘కేసరి 2’ ఎట్టకేలకు ఈరోజు అంటే ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించగా, కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. దీనిని 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారణమైన కీలక వ్యక్తులలో ఒకరైన మైఖేల్ ఓ’డ్వైర్ పై కేసు పెట్టిన సి. శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందించారు. మరి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న అక్షయ్ కు ఈ మూవీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందా? దేశభక్తి కథాంశంతో సాగే ఈ కోర్టు రూమ్ డ్రామా ఎంత వరకు మెప్పించింది ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఈ చిత్రం జలియన్ వాలాబాగ్ మారణకాండ వెనుక దాగున్న సత్యాన్ని బహిర్గతం చేయడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి, వారిని కోర్టుకు తీసుకువచ్చిన న్యాయవాది, రాజకీయ నాయకుడు, బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చెట్టూర్ శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఉన్నాడు అన్న ధీమాతో ఈ కుట్రను ఇన్వెస్టిగేట్ చేయమని శంకరన్ కు అప్పగిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో బుర్ర బద్దలయ్యే నిజాలు బయట పడతాయి. దీంతో ఆయన స్వయమగా బ్రిటిష్ జనరల్ ఓ’డయ్యర్ క్రూరత్వాన్ని ప్రపంచానికి ఛాటి చెప్పాలని డిసైడ్ అవుతాడు. మరి ఈ విషయాన్ని ఆయన ఎలా బయటపెట్టాడు? అందులో ఎదురైన సవాళ్ళు ఏంటి? అనే ఆసక్తికరమైన కథను తెలుసుకోవాలంటే థియేటర్లలో ‘కేసరి 2’ చూడాల్సిందే.
విశ్లేషణ
రఘు అండ్ పుష్ప పలాట్ రాసిన “ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్: వన్ మ్యాన్స్ ఫైట్ ఫర్ ది ట్రూత్ ఎబౌట్ ది జలియన్ వాలాబాగ్ మాసకర్” పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కరణ్ సింగ్ త్యాగి, నిర్మాత అండ్ రచయిత అమృత్‌పాల్ సింగ్ బింద్రాతో కలిసి సహ రచయితగా కూడా వర్క్ చేశారు. ‘కేసరి 2’తో వీరిద్దరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని సృష్టించారు. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌లో హై పాయింట్‌లు చక్కగా వివరించారు. ఈ దారుణమైన కేసును ఎలా పరిష్కరించారన్న విషయాన్ని సున్నితంగా తెరపై చూపించిన విధానం ప్రశంసనీయం. సాధారణంగా మాస్ మసాలా సినిమాలలో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి యాక్షన్, కామెడీ సీన్స్ ను యాడ్ చేస్తారు. కానీ ఇలాంటి దేశభక్తి సినిమాలలో డైలాగ్‌లు ఎఫెక్ట్ చూపిస్తాయి. సుమిత్ సక్సేనా అందించిన డైలాగులు ఆకట్టుకుంటాయి. దేశభక్తి సినిమా కదా ఏడుస్తూ కూర్చుంటామేమో అనుకుంటే పొరబడినట్టే. సినిమా మొత్తం ఉత్తేజపరిచేలా ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగిన ఈ ఘటనకు ఈ సినిమాను చూస్తే ఇప్పటికీ బ్రిటిష్ వారిపై కోపంతో రక్తం మరిగిపోతుంది.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ చెత్తూర్ శంకరన్ నాయర్ పాత్రను పోషించాడు. న్యాయవాది పాత్రలో ఆయన జీవించాడు. అతని ప్రత్యర్థి న్యాయవాది రెజినా కాసాండ్రా కూడా కోర్టు గది క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో తన పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కూడా అద్భుతంగా నటించారు. అనన్య పాండే మాత్రం ఎమోషనల్ సీన్స్ లో తడబడింది. సినిమా కథనం నిదానంగా సాగడం కొంతమందికి విసుగు తెప్పించవచ్చు. కథ బలహీనతలను క్లైమాక్స్ సన్నివేశాలు కొంతమేర సరిదిద్దినప్పటికీ, సినిమా అంతటా ఆ స్థాయి ఉత్కంఠ లేకపోవడం ఒక లోపం.
ప్లస్ పాయింట్స్
సంగీతం
నిర్మాణ విలువలు
విజువల్స్
నటీనటుల యాక్టింగ్
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
సహాయ నటుల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం
చివరిగా
ఎంటర్టైనెంట్ తో పాటు ఎమోషన్ ఉన్న మూవీ. జలియన్ వాలాబాగ్ మారణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫ్యామిలీతో కలిసి ఓసారి చూడదగ్గ దేశభక్తి మూవీ. అక్షయ్ కుమార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్టే.
రేటింగ్ : 2.25/5