Gentle Monster AI Smart Glasses: సాంకేతిక ప్రపంచంలో రోజురోజుకీ వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ భర్తీ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ ఐవేర్ బ్రాండ్ ‘జెంటిల్ మాన్స్టర్’ ఒక సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర టీజర్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. గూగుల్, శాంసంగ్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లాసెస్ డిసెంబర్‌లో వినియోగదారుల ముందుకు రానున్నాయి.
హాలీవుడ్ ప్రముఖ నటుడు జోక్విన్ ఫినిక్స్ నటించిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు జోనాథన్ గ్లేజర్ దీనికి దర్శకత్వం వహించారు. ఒక హోటల్‌లో ఉండే సేల్స్‌మ్యాన్ చుట్టూ తిరిగే విచిత్రమైన పరిస్థితులను ఇందులో చూపించారు. ఇందులో జోక్విన్ ఫినిక్స్ తన కళ్లద్దాలను తాకి ‘ట్రాన్స్‌లేట్’ చేయమని కోరడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిజ జీవితానికి, కలల ప్రపంచానికి మధ్య జరిగే ప్రయాణంగా ఈ ప్రచార చిత్రాన్ని జెంటిల్ మాన్స్టర్ అభివర్ణించింది. ఈ పూర్తి ప్రచార చిత్రం నవంబర్ మధ్యలో విడుదల కానుంది.
ఈ స్మార్ట్ గ్లాసెస్ ఆండ్రాయిడ్ ఎక్స్‌ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఇందులో గూగుల్ జెమిని ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, నేవిగేషన్, కెమెరా ద్వారా మనం చూసే వస్తువుల గురించి వివరాలు అడిగి తెలుసుకోవడం వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నవంబర్ 13 నుంచి 23 వరకు ప్రత్యక్షంగా ఈ గ్లాసెస్‌ను అనుభవించేందుకు ఒక ప్రత్యేక ప్రివ్యూ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: 40 కి.మీ. దూరంలోని రెస్టారెంట్ నుంచీ ఫుడ్ ఆర్డర్.. జొమాటో కొత్త ఫీచర్, 7 నగరాల్లో ప్రారంభం!
కేవలం జెంటిల్ మాన్స్టర్ మాత్రమే కాకుండా.. ప్రముఖ బ్రాండ్ వార్బీ పార్కర్ కూడా సొంత ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొస్తోంది. ఇవి కూడా శాంసంగ్, గూగుల్ మైత్రితోనే రూపొందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వార్బీ పార్కర్ గ్లాసెస్ ప్రీ-ఆర్డర్లు నవంబర్ 12న ప్రారంభమై, డిసెంబర్ మధ్యలో డెలివరీలు మొదలవుతాయి. మొదట 65 స్టోర్లలో, ఆ తర్వాత మరో 295 స్టోర్లలో వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
అమెరికా వినియోగదారుల కోసం నవంబర్ 12 నుంచే జెంటిల్ మాన్స్టర్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇతర దేశాల్లో ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ఈ స్మార్ట్ గ్లాసెస్ అధికారిక ధరల వివరాలు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైనప్పుడే పూర్తిగా వెల్లడికానున్నాయి.
Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!