iPhone 20: ఐఫోన్ అంటేనే కొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లు గుర్తుకొస్తాయి. అలాంటిది 2027లో రానుందని ప్రచారం జరుగుతున్న ఐఫోన్ 20లో యాపిల్ భారీ మార్పులకు ప్లాన్ చేస్తోందట. మొదటి ఐఫోన్ విడుదలై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. అంచులకు బెజెల్స్ దాదాపుగా కనిపించని స్క్రీన్, నాలుగు వైపులా వంపులు తిరిగిన గ్లాస్ డిజైన్, నొక్కే బటన్లకు బదులుగా సరికొత్త టెక్నాలజీ.. ఇలా ఎన్నో మార్పులు ఉండొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజంగా ఈ ఫీచర్లు వస్తే ఐఫోన్ లుక్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మరి యాపిల్ తన 20 ఏళ్ల ప్రత్యేక ఫోన్‌లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాలేంటో చూద్దాం.
iPhone 20లో యాపిల్ డిజైన్‌పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫోన్ ముందు భాగంలో అంచులు కనిపించకుండా.. స్క్రీన్ మరింత పెద్దగా కనిపించేలా మార్పులు చేయొచ్చని సమాచారం. నాలుగు వైపులా వంపులు ఉన్న గ్లాస్ డిజైన్‌ను కూడా యాపిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొత్త అనుభూతి కలగొచ్చు. పారదర్శకంగా, మెరిసేలా కనిపించే లిక్విడ్ గ్లాస్ తరహా డిజైన్ కూడా ఇందులో ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: మనలాగే మాట్లాడే ఈ ‘పర్సనల్ ఏఐ అవతార్’ గురించి తెలుసా? గూగుల్ జెమిని కొత్త ఫీచర్ ఇదే!
iPhone 20 Pro మోడళ్లలో పెద్ద స్క్రీన్లు ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా Pro Max మోడల్‌లో 6.96 అంగుళాల డిస్‌ప్లే వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పలుచని బెజెల్స్‌తో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మరింత బాగుండొచ్చు. సెల్ఫీ కెమెరాను స్క్రీన్ కిందకు తీసుకొచ్చే టెక్నాలజీపై కూడా చర్చ జరుగుతున్నా, అది ఈ ఫోన్‌లో వస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు.
సాధారణంగా ఐఫోన్లలో ఉండే పవర్, వాల్యూమ్ బటన్ల స్థానంలో సాలిడ్ స్టేట్ బటన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి నొక్కినప్పుడు హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ద్వారా స్పందిస్తాయి. కదిలే భాగాలు తగ్గడం వల్ల బటన్ల మన్నిక పెరగొచ్చు. అయితే ఇప్పటివరకు వాడుతున్న బటన్లకు అలవాటు పడిన వారికి ఈ కొత్త విధానం మొదట్లో కాస్త భిన్నంగా అనిపించవచ్చు.
ఇంత కొత్త డిజైన్‌ను పెద్ద సంఖ్యలో తయారు చేయడం యాపిల్‌కు సవాలుగా మారొచ్చు. వంపులు ఉన్న డిస్‌ప్లే తయారీ, బటన్ల స్పందనను సరిగ్గా పనిచేసేలా చేయడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. డైనమిక్ ఐలాండ్‌లోనూ మార్పులు రావచ్చని అంచనాలున్నాయి. మొత్తంగా iPhone 20 యాపిల్‌కు ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. అయితే కొత్త ఫీచర్లు నిజంగా ఎలా ఉంటాయో, ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఒప్పో రెనో 17 సిరీస్‌లో ఇవే స్పెషల్ ఫీచర్లు!