Rice Prices: ఎల్ నినో ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ వాసులపై కూడా పడింది. సిటీలోని పేద, మధ్యతరగతి ప్రజల వంటింటిపై ధరల దండయాత్ర చేస్తున్నాయి. మార్కెట్ లో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఏమీ కొనెట్టు లేదు. ఏమీ తినెట్టు లేదన్న పరిస్థితి నెలకొంది. గత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో వరి సాగు ముందుకు సాగక, బియ్యం కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం నేరుగా హైదరాబాద్ వాసుల జీవనంపై పడింది. ఒకవైపు బియ్యం ధరలు మండిపోతుంటే మరో వైపు నిత్యావసర సరుకుల ధరలు పోటీపడి పెరుగుతున్నాయి.
కిలోల లెక్కన కొనాల్సిన బియ్యం నుంచి పప్పులు, నూనెలు, చక్కెర, బెల్లం వరకు ఏది ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా నాణ్యమైన సన్న బియ్యం ధర రెండు నెలల క్రితం రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉండగా, ఇపుడు రూ. 90 నుంచి రూ. 100 కు పెరిగాయి. హైదరాబాద్ జిల్లా చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ మండలాల్లో రైతులు ప్రతి ఏటా ఇదే సీజన్ లో క్వింటాల్ సన్న బియ్యాన్ని రూ. 6 వేల నుంచి ఆరున్నర వేల రూపాయల మధ్య విక్రయించే వారు. కానీ ఎల్ నినో ప్రభావంతో ఈ సారి పంట దిగుబడి సరిగ్గా లేకపోవటంతో క్వింటాల్ బియ్యం ధర రూ. 9 వేల నుంచి రూ.10 వేలకు మధ్య పలుకుంది.
చేవెళ్ల, వికారాబాద్ మండలాల్లో చాలా మంది రైతులు గతేడాది పండించిన బియ్యంలో కొంత మేరకు అమ్ముకుని కొంత వరకు తమ ఇంటి అవసరాలకు నిల్వ చేసుకోగా, కొందరు రైతుల ఇళ్లలో బియ్యపు నిల్వలు దగ్గరపడటంతో రైతులే శంకర్ పల్లి, చేవెళ్ల మండల కేంద్రాల్లో రూ. 10 వేలకు క్వింటాల్ బియ్యాన్ని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. బియ్యమే గాక, కూరగాయల ధరలు సైతం కొండెక్కుతున్నాయి. ఉల్లిపాయ ఇప్పటికీ రూ.వందకు కిలోన్నరగా విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో సరఫరా, నిల్వలు, ధరలపై సమర్థవంతమైన పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే కొరత ఉంటే దాన్ని అధిగమించే చర్యలేవి? కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బియ్యం ధరల పెరుగుదల వెనుక ఎల్ నినో ఎఫెక్టుతో ఈ సారి వరి సాగు ఆశాజనకంగా లేకపోవటమే కారణమా? లేక బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బియ్యం లభ్యత తగ్గడం, నాణ్యమైన రకాలపై డిమాండ్ పెరగడం, ఇతర రాష్ట్రాలకు సరఫరా వంటి కారణాల వల్లే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారులు, మిల్లర్లు నిల్వలను కృత్రిమ కొరతను సృష్టిస్తూ విచ్చలవిడిగా ధరలు పెంచుతున్నా, ధరలను నియంత్రణపై సర్కారు దృష్టి సారించకపొవటం వారికి వరంగా మారిందని కొనుగోలు దారులు వాపోతున్నారు.
Also read: తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
రెండు నెలల క్రితం సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ. 60 మధ్య అమ్ముడుపోగా, ఇప్పుడు సన్న బియ్యం రకాన్ని బట్టి రూ.80 నుంచి రూ. వంద వరకు ధర పలుకుతుండటంతో రోజువారీ ఆదాయంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తూ జీవితం గడిపే పేద వర్గాలకు చెందిన ప్రజలపై అదనంగా ఆర్థిక భారం పడుతుంది. మరోవైపు పౌరసరఫరాల సంస్థ వద్ద సుమారు 34 లక్షల టన్నుల వరి ధాన్యం అదనపు నిల్వగా ఉందని సమాచారం. ఇందులో నాణ్యమైన రకాలకు చెందిన ధాన్యం కూడా గణనీయంగా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ నిల్వలను విక్రయించేందుకు చేపట్టిన వేలం ప్రక్రియకు ఆశించిన స్పందన రాకపోవడంతో ధాన్యం మిల్లర్ల గిడ్డంగుల్లోనే ధాన్యం పేరుకుపోయినట్లు తెలిసింది. ఇంత నిల్వలు ఉన్నప్పుడు వాటిని మార్కెట్‌కు చేర్చి ధరల ఒత్తిడిని పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తుంది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రతిసారి సరఫరా సమస్యలు, డిమాండ్ పెరుగుదల వంటి కారణాలు చెప్పడం సాధారణంగా మారిందన్న విమర్శలున్నాయి. కానీ ధరల పెరుగుదల వెనుక నిజమైన కొరత ఉందా? నిజంగానే ఎల్ నినో ప్రభావం పడిందా? అక్రమార్జన కోసమే ఎల్ నినోను బూచీగా చూపుతూ ధరలు పెంచుతున్నారా? అనే అంశాలను పౌర సరఫరాల శాఖ గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. గోదాముల్లో నిల్వలు ఎంత ఉన్నాయి? హోల్‌సేల్ మార్కెట్లలో ఏ ధరకు విక్రయిస్తున్నారు? రిటైల్ దుకాణాల్లో వినియోగదారులకు ఎంతకు అమ్ముతున్నారు? నిల్వల వివరాలు, కొనుగోలు బిల్లులు పరిశీలించటంతో పాటు విక్రయ ధరలను నిరంతరం తనిఖీ చేస్తే తప్పా, ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే పరిస్థితులు నెలకొంటాయి.
సింపుల్ గా ఏ కరీ వండాలన్నా ఉల్లిపాయ మస్టు. అలాంటి ఉల్లి దాదాపు రెండు నెలలుగా రూ.వందకు కేవలం కిలోన్నరగా అమ్ముడుపోతుంది. ఉల్లి ధర పెరిగినపుడల్లా సిటీలోని చాలా బిర్యానీ హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లికి బదులుగా కీరాను వినియోగదారులకు వడ్డిస్తున్నారు. మరి కొన్ని హోటళ్లు మరో అడుగు ముందుకేసి, ఉల్లిపాయ, నిమ్మకాయ కావాలంటే రూ. 20 నుంచి హోటల్ స్థాయిని బట్టి రూ. 50 వరకు అదనంగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. బియ్యంతో మొదలైన ధరల మోత కూరగాయల మార్కెట్‌లోనూ కొనసాగుతోంది.
రెండు నెలల క్రితం ఉల్లిపాయల ధర కిలోకు రూ. 20 నుంచి రూ. 30 మధ్య ఉండగా ఇపుడు కిలో రూ. 60 నుంచి రూ. 70 మధ్య పలుకుంది. లేదా రూ. వందకు కిలోన్నరగా అమ్ముడుపోతుంది. ఎండు మిరపకాయల ధరలు కిలోకు రూ.240 నుంచి రూ.300కు పెరిగాయి. కార్పొరేట్ రిటైల్ దుకాణాల్లో రూ.360 వరకు విక్రయిస్తున్నారు. క్యారెట్ కిలో రెండు నెలల క్రితం రూ.60 నుంచి రూ.70 మధ్యనుండగా, ఇపుడు రూ.వంద నుంచి రూ. 120 మధ్య పలుకుతుంది. చిక్కుడుకాయలు రూ.80, ముల్లంగి ధర రూ.30 నుంచి రూ. 40 మధ్య, పచ్చిమిర్చి ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య, వంటనూనెల ధరలు సైతం పెరగగా, కిలో చెక్కర రూ. 40 పలకగా, తాజాగా రెండు రోజు నుంచి కిలోధరపై రూ.20 పెరిగి, రూ. 60 గా పలుకుతుంది.
Also Read: మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!