Apple Foldable Phone: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఎన్నో ఆశలతో మార్కెట్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ ఇప్పుడు ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కొద్దిరోజులకే లోపలి స్క్రీన్ మధ్యలో పగుళ్లు వస్తున్నట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఫోన్‌ను కిందపడేయకపోయినా.. ఎలాంటి దెబ్బ తగలకుండానే స్క్రీన్ మీద గీతలు, పగుళ్లు రావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా ఫోన్ మడతపెట్టే హింజ్ భాగంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ సమస్యపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటంతో యాపిల్ అలర్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లు, అధీకృత సర్వీస్ సెంటర్లకు ఒక ఇంటర్నల్ మెమో పంపింది. ఎవరైనా కస్టమర్లు ఈ సమస్యతో వస్తే.. వారి ఫోన్‌ను పరిశీలించి స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఇది చాలా తక్కువ మందికే వస్తున్న సమస్య అని, భయపడాల్సిన పనిలేదని కంపెనీ చెబుతోంది.
Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో ఇంతకంటే ఏం కావాలి? మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త వాచ్!
ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తోందనే దానిపై యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రముఖ రిపేర్ వెబ్‌సైట్ ఐఫిక్స్ఐట్ మాత్రం దీనిపై ఒక అంచనా వేసింది. ఫోన్ లోపల ఉండే హింజ్ మెకానిజంలో చిన్న లోపం ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఫోన్ మడతపెట్టేటప్పుడు లోపల ఉండే ఒక సపోర్ట్ బార్ సరిగ్గా వెనక్కి వెళ్లకుండా స్క్రీన్ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుండటం వల్లే ఈ పగుళ్లు వస్తున్నాయని వారు భావిస్తున్నారు.
ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను రిపేర్ చేయడం టెక్నీషియన్లకే పెద్ద సవాల్‌గా మారింది. ఐఫిక్స్ఐట్ దీన్ని పరిశీలించి 10కి 5 పాయింట్లు మాత్రమే ఇచ్చింది. ఒకవేళ వారంటీ గడువు ముగిసిన తర్వాత ఈ స్క్రీన్ రిపేర్ చేయించుకోవాలంటే దాదాపు రూ.94,817 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఎలాంటి రీకాల్ ప్రకటించకపోయినా.. స్క్రీన్ ప్రాబ్లమ్ ఉన్నవారు నేరుగా యాపిల్ కేర్‌ను సంప్రదించాలని సూచిస్తోంది.
Also Read: TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!