Apple Maps New Update: మన దేశంలో ఐఫోన్ వాడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కానీ ఇప్పటివరకు రూట్ మ్యాప్స్ విషయంలో మాత్రం ఐఫోన్ యూజర్లు ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ మీదే ఆధారపడేవారు. మన దగ్గర యాపిల్ మ్యాప్స్ అంతగా అప్‌డేట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఈ లోటును భర్తీ చేస్తూ యాపిల్ ఇండియా తమ మ్యాప్స్ యాప్‌లో ఒక భారీ అప్‌డేట్ తీసుకొచ్చింది. మన రోడ్లకు, మన ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ కొత్త ఫీచర్లతో ఇకపై ప్రయాణం మరింత సులభం కానుంది. ఇంతకీ యాపిల్ మ్యాప్స్‌లో వచ్చిన ఆ మూడు మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మన దగ్గర ఎవరినైనా అడ్రస్ అడిగితే వీధుల పేర్లు చెప్పడం కంటే పక్కన ఉన్న బిల్డింగ్ లేదా పెట్రోల్ బంక్ పేరు చెప్పి దారి చెప్తుంటాం. ఇప్పుడు యాపిల్ మ్యాప్స్ కూడా మనలాగే ఆలోచిస్తోంది. సిరి కేవలం ‘కుడివైపు తిరగండి’ అని కాకుండా.. ‘పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కుడివైపు తిరగండి’ అంటూ చాలా స్పష్టంగా దారి చూపిస్తుంది. అలాగే హైవేలపై వెళ్లేటప్పుడు ఏ లైన్‌లో డ్రైవ్ చేయాలో కూడా ముందే అలర్ట్ చేస్తుంది. ఒకే ట్రిప్‌లో ఏకంగా 15 స్టాప్‌ల వరకు ప్లాన్ చేసుకునే వీలుంది. అంతేకాదు నడిచేవారికి, సైకిల్ తొక్కేవారికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ద్వారా చుట్టుపక్కల భవనాలను స్కాన్ చేసి కచ్చితమైన డైరెక్షన్స్ ఇస్తుంది.
ఒక కొత్త ప్రదేశానికి వెళ్లే ముందే అక్కడి పరిసరాలు ఎలా ఉన్నాయో ఫోన్‌లోనే చూసేలా Look Around ఫీచర్‌ను పరిచయం చేశారు. దీని ద్వారా హై-రిజల్యూషన్ స్ట్రీట్ వ్యూతో పాటు, మన దేశంలోని సుమారు 300 ప్రముఖ కట్టడాలను 3D రూపంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. త్వరలో మరిన్ని ప్రాంతాలను కూడా ఇందులో యాడ్ చేయబోతున్నారు.
కొత్త ఊరికి వెళ్లినప్పుడు అక్కడి బోర్డులు అర్థం కాక చాలామంది తికమక పడుతుంటారు. దీనికి చెక్ పెడుతూ యాపిల్ మ్యాప్స్‌లో రెండు భాషల లేబుల్స్ సపోర్ట్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషలు అందుబాటులో ఉండగా.. త్వరలోనే మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలను కూడా జోడించనున్నారు. దీనివల్ల ఏ ప్రాంతానికి వెళ్లినా మన భాషలోనే లొకేషన్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read: స్క్రీన్ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!