Apple vs Meta Glasses: టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్ సంస్థ.. ఇప్పుడు సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న మెటా స్మార్ట్ గ్లాసెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు యాపిల్ ఈ అడుగు వేస్తోంది. అయితే, ఈ స్మార్ట్ గ్లాసెస్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రముఖ బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ తన తాజా నివేదికలో యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌పై కీలక విషయాలను వెల్లడించారు.
నిజానికి యాపిల్ తమ స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ ఏడాది ఆఖర్లో పరిచయం చేసి, వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో డెలివరీలు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, తాజా నివేదికల ప్రకారం ఈ గ్లాసెస్ వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలస్యం వల్ల మెటా సంస్థకు మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. ఇప్పటికే మెటా సంస్థ రే-బాన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో జతకట్టి మార్కెట్లో ముందంజలో ఉంది.
యాపిల్ కంపెనీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ఐఫోన్ యూజర్ బేస్. కంపెనీ తీసుకురాబోయే స్మార్ట్ గ్లాసెస్ ఐఫోన్‌తో చాలా సులువుగా, వేగంగా కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెటా గ్లాసెస్ వాడే వారిలో కూడా చాలామంది ఐఫోన్ యూజర్లే ఉన్నారు. యాపిల్ తమ గ్లాసెస్‌ను ఐఫోన్‌తో మరింత అనుసంధానం చేయడం ద్వారా మెటా వైపు ఐఫోన్ వినియోగదారులు వెళ్లకుండా ఆపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైగా ఐఓఎస్, మెటా గ్లాసెస్ మధ్య కొన్ని ఫీచర్ల అనుసంధానాన్ని యాపిల్ ఇప్పటికే పరిమితం చేసింది.
Also Read: ఆ తేదీ నుంచే Flipkart GOAT Sale మొదలు.. iPhone 17, iPhone Air ధరలు భారీగా తగ్గుతాయ్!
ఇకపోతే ధర విషయానికి వస్తే.. మెటా గ్లాసెస్ చాలా అందుబాటు ధరలో ఉన్నాయి. మెటా గ్లాసెస్ ప్రారంభ ధర రూ.28,000గా ఉంది. కానీ, యాపిల్ బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ దృష్ట్యా దాని స్మార్ట్ గ్లాసెస్ ధర ఇంత తక్కువగా ఉండే అవకాశం అస్సలు లేదు. యాపిల్ గ్లాసెస్ ప్రీమియం ధరతోనే మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, మెటా కూడా మరింత తక్కువ ధరలో సొంత డిజైన్లతో కొత్త మోడల్స్‌ను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
మెటా ఇటీవల విడుదల చేసిన గ్లాసెస్ అధునాతన మ్యూజ్ స్పార్క్ ఏఐ మోడల్‌తో పనిచేస్తాయి. ఇందులో 12MP కెమెరాతో పాటు, దాదాపు 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ చేసుకునే అద్భుతమైన ఫీచర్ ఉంది. ఇలాంటి తరుణంలో యాపిల్ సంస్థ మెటాను తట్టుకుని నిలబడాలంటే కేవలం బ్రాండ్ ఇమేజ్ మాత్రమే సరిపోదు, అంతకుమించిన ఫీచర్లను తన స్మార్ట్ గ్లాసెస్‌లో జోడించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ రెండు దిగ్గజాల మధ్య స్మార్ట్ గ్లాసెస్ వార్ ఎలా ఉండబోతుందో చూడాలి.