1 నుంచి 50లోపు ఒక అంకెను ఎంపిక చేయండి అని ఎప్పుడైనా మీరు చాట్ జీపీటీని అడిగారా..?
అడిగితే ఏ సమాధానం రావడానికి అవకాశం ఎక్కువగా ఉందో తెలుసా..?
27. అవును పదే పదే మీరు అదే ప్రశ్నను అడిగితే సమాధానంలో కచ్చితంగా 27 ఉంటుంది. ఎక్కువసార్లు ఉంటుంది.
చాట్ జీపీటీనే కాదు, జెమినై, క్లాడ్, లేచాట్ వంటి AI ప్లాట్ ఫామ్స్ కి కూడా 27 అనేది ఎంతో ఇష్టమైన సంఖ్య. ఏఐకి మనం ఛాయిస్ ఇచ్చి ఓ సంఖ్యను చెప్పు అంటే 27 అని చెప్పడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేదో మేజిక్ కాదు, అరుదుగా జరిగిన సంఘటన అంతకంటే కాదు. కావాలంటే మీరూ చెక్ చేసి చూడండి. కచ్చితంగా చాట్ జీపీటీ 27నే మీకు చూపిస్తుంది.
ఎందుకిలా..?
క్రాస్ ప్లాట్ ఫామ్ ఔట్ పుట్స్ అనే ఆసక్తికర రచన చేసిన కార్తికేయ్ సెంగర్ అనే రచయిత మొటది సారిగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఒకసారి అంటే ఓకే, రెండోసారి అంటే అనుమానించొచ్చు, మూడోసారి కూడా ఏఐ కేవలం 27ని మాత్రమే మన ముందుంచితే కచ్చితంగా అది విశేషమే. ఒక్క చాట్ జీపీటీనే కాదు, మిగతా ఏఐ టూల్స్ కూడా ఇలా 27న అమితంగా ఇష్టపడటం వెనక కారణాలను ఆయన పరిశోధించారు. చివరకు అసలు విషయం బయటపెట్టాడు. చాట్ జీపీటీకంటే ముందు అది మానవులు కూడా అత్యంత తరచుగా వాడే నెంబర్ కావడంతో ఏఐ దాన్ని సెలక్ట్ చేస్తుందని చెప్పాడు.
అసలు కారణం ఏంటంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం పిలుచుకునే ఏఐ టూల్స్ కి అసలు ఇంటెలిజెన్స్ లేదు. అది కేవలం ఇంటర్నెట్ లో ఉండే కోట్లాది పేజీల డేటానుంచి సెలక్ట్ చేసిన వివరాలను మాత్రమే మనకు ఇస్తుంది. అలా అది సెలక్ట్ చేసి 27ని మన ముందుకు పదే పదే తీసుకొస్తోంది. అంటే మనం 27 అనే నెంబర్ ని ఆ స్థాయిలో వాడుతున్నామని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 27 అనేది ఎవరికీ లక్కీ నెంబర్ గా ఉండకపోవచ్చు. 1 నుంచి 50లో అది మిడిల్ నెంబర్ కూడా కాదు. కానీ పదే పదే అదే నెంబర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సెలక్ట్ చేయడానికి అసలు కారణం ఇంటర్నెట్ డేటాలో అది ఎక్కువసార్లు నిండి ఉండటమే.
27 ప్రాముఖ్యత ఏంటంటే..?
27ని మనకు తెలియకుండానే మనం తరచుగా వాడుతుంటాం. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పట్టే సమయం 27 రోజులు. మానవ చర్మ కణాలు కూడా ప్రతి 27 రోజులకు ఒకసారి పునరుత్పత్తి అవుతాయి. “27 క్లబ్” అనేది కూడా వరల్డ్ ఫేమస్ ఉంది – అమీ వైన్‌హౌస్, కర్ట్ కోబెన్, జిమి హెండ్రిక్స్ వంటి దిగ్గజ సంగీతకారుల బృందం.. 27 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అందుకే ఇంటర్నెట్ డేటాలో 27 అనేది రిపీటెడ్ గా మనకు కనపడుతుంది. అందులోనుంచి ఒక 27ని ఏపై బయటకు తీసి మనకు చూపెడుతోంది.
మనకు తెలియకుండానే మనం 27ని పదే పదే చూస్తున్నాం, చదువుతున్నాం. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కానీ చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ మాత్రం అలా రిపీటెడ్ గా కనపడుతున్న నెంబర్ ని గుర్తుంచుకుంటున్నాయి. మనం ఛాయిస్ ఇస్తే అదే నెంబర్ ని తిరిగి మనకు చూపెడుతున్నాయి. చాట్ జీపీటీకి 27 అంటే అందుకే అంత ఇష్టం.