Ghibli Style Art: గత కొద్ది రోజులగా చాట్ జీపీటీ వైరల్ ఇమేజ్ జనరేషన్ ‘ఘిబ్లీ స్టైల్’ ఆర్ట్ ఫీచర్ బాగా పాపులర్ అయ్యింది. ఒరిజినల్ ఫోటోలను అదిరిపోయే ఆర్టిస్టిక్ ఫోటోలుగా మార్చి నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తమ దైనందిన జీవితాలకు సంబంధించిన ఫోటోలను ‘ఘిబ్లీ స్టైల్’ ఆర్ట్ లోకి కన్వర్ట్ చేసుకుని ఆనందిస్తున్నారు. కొంత మంది ఫ్యామిలీ ఫోటోలు, మరికొంత మంది తమ పెట్ ఫోటోలను ఈ కొత్త ఫీచర్ ద్వారా మార్చుకుంటున్నారు. చేతితో గీసినట్లుగా ఉంటే ఈ ఫోటోలు అందరినీ ఎంతోబాగా ఆకట్టుకుంటున్నాయి. జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ శైలిలోని ఈ ఫోటోలో ఇట్టే నచ్చేస్తున్నాయి. అయితే, కొంత మంది నెటిజన్లు వాళ్ల ఘిబ్లీ ఎడిట్ ఫీచర్ లో ఏవో రహస్య విషయాలను గుర్తిస్తున్నారు. అసలు ఫోటోలలో లేని ఎలిమెంట్స్ ఘిబ్లీ ఫోటోల్లో కనిపించడం వెనుకు ఏదో మాయ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘిబ్లీ ఫోటోల్లో దెయ్యాలున్నాయా?
నెటిజన్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోటోలు చాట్ జీపీటీ, గ్రోక్ లాంటి ఇతర AI టూల్స్ ద్వారా ఘిబ్లీ స్టైల్ ఫోటోలుగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిల్లో అదనపు వ్యక్తులు కనిపించడాన్ని గమనించారు. ఇదే విషయాన్ని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాట్ జీపీటీకి దెయ్యాలను గుర్తించే అవకాశం ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ తన స్నేహితుల ఫోటోను ఘిబ్లీ స్టైల్ లోకి మార్చింది. అసలు ఫోటోలో నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు, కానీ, గ్రోక్ AI చేసిన ఘిబ్లీ ఫోటోలో ఐదుగురు మహిళలు కనిపించారు. సో, గ్రోక్ నలుగురి పక్కన ఉన్న ఓ దెయ్యాన్ని కూడా గుర్తించి ఐదుగురిగా కన్వర్ట్ చేసిందని సదరు యూజర్ రాసుకొచ్చింది.
అటు మేకప్ ఆర్టిస్ట్ బర్ఖా దహ్రా తన భర్తతో ఉన్న తన ఫోటోను ఘిబ్లీ స్టైల్ లో కన్వర్ట్ చేసుకుంది. గ్రోక్ లో ఆ ఫోటో మారిన తర్వాత మూడవ వ్యక్తి కనిపించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ఘిబ్లీ ట్రెండ్ సరదాగా ఉంటుంది. అంతేకాదు, దెయ్యాన్ని కూడా గుర్తిస్తుంది” అని ఆమె రాసుకొచ్చింది.
పలువురు నెటిజన్లు కూడా ఘిబ్లీ ఫోటోల్లో మార్పులు చేయడాన్ని గుర్తించారు. లేని వ్యక్తులను ఎలా చూపిస్తుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఘోస్ట్ డిటెక్టర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రముఖ ట్రావెలర్ శిశిర్ దేశ్‌ముఖ్ తన ఫోటోను ఘిబ్లీ ఆర్ట్ వర్క్ గా చాట్ జీపీటీలో మార్చుకున్నాడు. అసలు చిత్రంలో అతను కారుకు ఆనుకుని ఉన్నట్లు కనిపించాడు. పక్కన వేరే ఎవరూ లేరు. చాట్ జీపీటీ ఘిబ్లీ ఫోటోలో మాత్రం దూరంగా మరో వ్యక్తి కనిపించాడు. దీంతో ఆయన షాకయ్యాడు. నేను గుర్తించని వ్యక్తిని, చాట్ జీపీటీ గుర్తించింది. నిజంగా దెయ్యాన్ని గుర్తించే శక్తి దానికి ఉందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదంతా ప్రోగ్రామింగ్ లో లోపంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఏప్రిల్ 1వ తేదీని ‘ఫూల్స్ డే’ అని ఎందుకంటారు? ఆ రోజు ఏమైంది?