Digital Arrest numbers : డిజిటల్ అరెస్ట్… ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరూ హడలిపోతున్నారు. ఎంతగా ప్రభుత్వం, సైబర్ పోలీసులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ ప్రతిచోటా ఈ డిజిటల్ అరెస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం స్పందించింది. స్కామర్స్ అంతర్జాతీయంగా కాల్స్ చేస్తారు కాబట్టి ఆ నెంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఎట్టి పరిస్థితుల్లోనే లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. దీంతో సైబర్ నేరాలకు, డిజిటల్ అరెస్టుకు అడ్డుకట్ట వేయొచ్చని వెల్లడించింది.
భారత్లో రోజు రోజుకీ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. బాధితులు ఎక్కువైపోతున్నారు. లక్షల్లో, కోట్లలో డబ్బును పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో బంధించే సైబర్ నేరగాళ్లు మభ్య పెట్టి అమాయకులను తమ వలలో వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని మోడీ స్పందించి అవగాహన కల్పించినప్పటికీ… ఇలాంటి నేరాలు ఆగటం లేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ (DoT) అంతర్జాతీయంగా వచ్చే మోసపూరిత కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించింది.
స్కామర్స్ అంతర్జాతీయ నెంబర్లతో కాల్స్ చేసినప్పుడు కనిపెట్టటం చాలా తేలికని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ తెలిపింది. +77, +89, +85, +86, +84 వంటి కొన్ని తెలియని దేశ కోడ్‌ల నుండి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే ఇవి స్కామర్‌ల నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. DoT, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ రకమైన కాల్స్ చేయవని.. సంచార్ సాథి అనే పోర్టల్ ద్వారా అనుమానాస్పద కాల్స్ ను కనుక్కునే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో అనుమానాస్పద నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం సైతం ఉంటుందని తెలిపింది. ఈ నంబర్స్ ను బ్లాక్ చేస్తే బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఎక్కడికక్కడ డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కేసులో మోసపోయి కోట్లు పోగొట్టుకున్న సంగతి తెలిసింది. ఇక మరో యువ ఇంజనీర్ సైతం డిజిటల్ అరెస్ట్ లో మోసపోయాడు. పార్సిల్ వచ్చిందని, ముంబై పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నామని చెబుతూ.. మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్నావని బెదింరించారు. ఆ వ్యక్తిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు లక్షల్లో కొల్లగొట్టారు. ఇక తాజాగా ఓ యువతకి సైతం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ట్రైన్ నుంచి మాట్లాడుతున్నామని.. పోలీస్ అధికారులు అంటూ నమ్మించారు. ఈ ఫోన్ నెంబర్ పై ఫిర్యాదులు ఉన్నాయని.. పోలీసుల నుంచి ప్రత్యేక సర్టిఫికెట్ పొందకపోతే మూసివేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన చెందిన ఆ యువతి నిజమని నమ్మి సైబర్ నేరగాళ్లకు తన బ్యాంక్ ఖాతా వివరాలను తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.7.29 లక్షలు మాయమయ్యాయి. ఆ తర్వాత ఆన్లైన్లో ఈ విషయంపై సర్చ్ చేసిన ఆ అమ్మాయి మోసపోయానని గుర్తించి డిజిటల్ అరెస్టుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక ఎక్కడికి అక్కడ ఈ కేసులో బయటపడుతూనే ఉన్న నేపథ్యంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ… స్కామర్లు ఈ సంవత్సరం మొదటి పది నెలల్లోనే ప్రజల నుండి దాదాపు రూ. 2,140 కోట్లను మోసగించారని తెలిపింది. ప్రతి నెలా సగటున రూ. 214 కోట్లకు పైగా నష్టపోయారని… ఈ మోసగాళ్లు తరచూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), పోలీసులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ప్రధాన భారతీయ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసగించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపింది.
ALSO READ : చైనా పవర్ బ్యాంక్స్ కొంటున్నారా? కేంద్రం ఏమంటుందంటే..!