Digital Rupee: మన దేశంలో ఇప్పుడు చిన్న షాపులో టీ తాగినా, పెద్ద మాల్‌లో షాపింగ్ చేసినా చేతిలో నగదు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క QR కోడ్ స్కాన్ చేస్తే చాలు.. క్షణాల్లో చెల్లింపు పూర్తవుతోంది. యూపీఐ (UPI) మన రోజువారీ జీవితంలో అంతలా భాగమైపోయింది. అయితే డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలోకి ఇప్పుడు మరో కొత్త రూపం రాబోతోంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన ‘డిజిటల్ రూపాయి’ (e₹). పేరుకు రూపాయే అయినా.. ఇది మనం వాడుతున్న యూపీఐకి భిన్నంగా పనిచేస్తుంది. అసలు డిజిటల్ రూపాయి అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? యూపీఐతో దీనికి ఉన్న తేడా ఏంటి? భవిష్యత్తులో మన డబ్బు లావాదేవీలను ఇది ఎలా మార్చవచ్చు? సామాన్యులకు దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో సింపుల్‌గా తెలుసుకుందాం.
మన జేబులో ఉండే కాగితపు నోట్లు, నాణేలకు ఇది ఒక ఎలక్ట్రానిక్ రూపం. దీన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలతో పోలిస్తే.. దీనికి పూర్తిస్థాయి ప్రభుత్వ భరోసా ఉంటుంది. మన చేతిలోని రూ.100 నోటుకు ఎంత విలువ ఉంటుందో, ఈ డిజిటల్ రూ.100కు కూడా అంతే విలువ ఉంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ దీన్ని సామాన్య ప్రజల అవసరాల కోసం ‘రిటైల్’, బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ‘హోల్‌సేల్’ విభాగాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షిస్తోంది.
చాలామంది యూపీఐ, డిజిటల్ రూపాయి రెండూ ఒకటే అనుకుంటారు. కానీ రెండింటికీ చాలా తేడా ఉంది. యూపీఐ అనేది ఒక పేమెంట్ సిస్టమ్ మాత్రమే. మనం యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు, మన బ్యాంకు ఖాతాలోని డబ్బు ఎదుటివారి బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది. కానీ డిజిటల్ రూపాయి అలా కాదు, ఇదే స్వయంగా ఒక కరెన్సీ. ఇందులో బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండా, నేరుగా మీ ఫోన్‌లోని డిజిటల్ వ్యాలెట్‌లోనే ఆర్బీఐ జారీ చేసిన నగదు నిల్వ ఉంటుంది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!
డిజిటల్ రూపాయి వినియోగం పెరిగితే మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఆఫ్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేసే వెసులుబాటును ఆర్బీఐ పరిశీలిస్తోంది. అంతేకాకుండా.. ప్రభుత్వ పథకాల డబ్బులు పక్కదారి పట్టకుండా, ఏ అవసరం కోసమైతే ఇచ్చారో దానికే ఖర్చు చేసేలా ‘ప్రోగ్రామబుల్’ ఫీచర్లను ఇందులో తీసుకురానున్నారు.
డిజిటల్ రూపాయి వచ్చినంత మాత్రాన క్యాష్ వాడకం వెంటనే ఆగిపోదు. నగదు లావాదేవీలు, యూపీఐ ఎప్పటిలాగే కొనసాగుతాయి. మనకు ఉన్న పేమెంట్ ఆప్షన్లలో ఇదొక అదనపు సౌకర్యం మాత్రమే. అయితే దీన్ని వాడేటప్పుడు కేవలం అధికారిక బ్యాంకు యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. త్వరలోనే ఈ డిజిటల్ రూపాయి మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారబోతోంది.
Also Read: వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!