Udaipur Ruthi Rani Mahal| రాజస్థాన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అందమైన సరస్సులు, అద్భుతమైన కోటలు, రాజభవనాలు. అయితే, అక్కడి ప్రతి చారిత్రక కట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంటుంది. కొన్ని కథలు రాజుల వీరత్వాన్ని చెబితే, మరికొన్ని రాణుల ఆత్మగౌరవాన్ని, ఆవేదనను గుర్తుచేస్తాయి. అలాంటి ఆసక్తికరమైన కథే ఉదయ్‌పూర్‌లోని రూఠీ రాణి మహల్‌కూ ఉంది. ఆ కథ వివరాలు మీ కోసం.
జైసమంద్ సరస్సు ఒడ్డున రూఠీ రాణి మహల్
ఉదయ్‌పూర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో జైసమంద్ సరస్సు ఉంది. ఈ అందమైన సరస్సు ఒడ్డున రూఠీ రాణి మహల్ కనిపిస్తుంది. మహారాణా జైసింగ్ 1685 నుంచి 1691 మధ్య ఈ భవనాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనాలున్నాయి. ఆయన భార్య కమలాదేవితో ఈ రాజభవనానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
కమలాదేవి బిజోలియా ప్రాంతానికి చెందిన పర్మార్ రాజవంశంలో జన్మించింది. ఆమె మహారాణా జైసింగ్‌ను వివాహం చేసుకుని మేవార్ రాజకుటుంబంలో అడుగుపెట్టింది. స్థానిక కథనాల ప్రకారం.. పెళ్లిరోజు రాత్రి మహారాజు ఇతర పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన రాణి దగ్గరకు ఆలస్యంగా వచ్చాడు. ఈ పరిణామం కమలాదేవిని తీవ్రంగా బాధించింది. భర్త తనను పట్టించుకోలేదని భావించిన ఆమె రాజభవనాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.
ఆమె జైసమంద్ సరస్సు సమీపంలోని మరో భవనంలో నివసించడం ప్రారంభించింది. రాజు తిరిగి రాజభవనానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించలేదు. స్థానిక కథల ప్రకారం..జీవితాంతం అక్కడే గడిపింది. అప్పటి నుంచి ఆ భవనానికి రూఠీ రాణి మహల్ అనే పేరు వచ్చింది.
Also Read: ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో కూడా రూఠీ రాణి మహల్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ కథ జైసల్మేర్ యువరాణి ఉమాదేవికి సంబంధించినది. ఆమె 1532లో జోధ్‌పూర్ పాలకుడు మాల్దేవ్ రాథోడ్‌ని ఆమె వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత ఉమాదేవి తన దాసి భర్మలితో కలిసి భర్త ఇంటికి చేరుకుంది. భర్మలి అందానికి ఆకర్షితుడైన మహారాజు మాల్దేవ్ భార్యను నిర్లక్ష్యం చేసి దాసితో ఎక్కువ సమయం గడిపాడని కథనం చెబుతోంది. రాజు తనను పట్టించుకోలేదని ఉమాదేవి బాధపడింది. దీంతో ఆమె భర్తను విడిచిపెట్టి అజ్మీర్‌లోని తారాగఢ్ కోటకు వెళ్లిపోయిందని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
ఉదయ్‌పూర్ కమలాదేవి, అజ్మీర్ ఉమాదేవి కథలు వేర్వేరు కాలాలకు చెందినవి. అయితే, ఇద్దరూ తమ ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చి రాజభవనాలను విడిచిపెట్టారని ప్రచారంలో ఉంది. అందుకే ఈ కథలు నేటికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజస్థాన్ రాజభవనాలను సందర్శించే పర్యాటకులకు ఈ కథలు ఆకట్టుకుంటున్నాయి.