Earphone Hearing: సంగీతానికి ఉండే మ్యాజిక్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినసొంపైన పాటలు వినడం ద్వారా రోజువారీ పనుల్లో ఉండే అలసటను, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో చెవుల్లో ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గంటల తరబడి పాటలు వినడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే వినికిడి శక్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్లను మితి మీరి వాడుతున్న వారిలో వినికిడి సమస్యలు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. దీనికి ఎలా చెక్ పెట్టాలో ఈ కథనంలో చూద్దాం.
గతంలో వినికిడి సమస్యలు కేవలం వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతీరోజూ బిగ్గరగా పాటలు వినడం వల్ల చాలా చిన్న వయస్సులోనే యువత వినికిడి లోపం బారిన పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే మిగతా ఆరోగ్య సమస్యల్లాగా వినికిడి లోపం వచ్చిన వెంటనే ప్రత్యేకంగా లక్షణాలు అంటూ కనిపించవని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదం చాలా నెమ్మదిగా, ఎటువంటి నొప్పి లేకుండా పెరుగుతుందని పేర్కొంటున్నారు. సమస్య తీవ్రమై, శాశ్వతంగా వినికిడి దెబ్బతిన్న తర్వాతే చాలామంది దీనిని గుర్తిస్తున్నారని తెలియజేస్తున్నారు. ప్రధానంగా 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం వల్ల లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయని ఈ కణాలు ఒకసారి దెబ్బతింటే మళ్లీ పునరుత్పత్తి కావుని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు ’60/60′ నియమాన్ని సూచిస్తున్నారు. దీని ప్రకారం గరిష్ట వాల్యూమ్‌లో 60 శాతానికి మించకుండా, ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇయర్‌ఫోన్లు వాడకుండా ఉండటమే దీని ఉద్దేశం. పాటలను సురక్షితమైన వాల్యూమ్‌లో విన్నప్పటికీ ప్రతి గంట వాడకం తర్వాత కనీసం 5 నిమిషాల పాటు ఇయర్‌ఫోన్లను తీసివేసి చెవులకు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు హితవు పలుకుతున్నారు.
Also Read: దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!
ఒకవేళ ఇప్పటికే కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చెవుల్లో నిరంతరం గంటలు మోగినట్లు లేదా రింగింగ్ శబ్దం రావడం, శబ్దాలు స్పష్టంగా వినపడకపోవడం, ఎదుటివారు మాట్లాడే మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగడం, చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు గుర్తిస్తే వైద్యులను కలవాలని హితవు పలుకుతున్నారు. అలాగే 50 ఏళ్లు దాటి.. బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఏటా తప్పనిసరిగా వినికిడి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!