భూ భ్రమణ వేగం పెరిగితే ఏమవుతుంది. తన భ్రమణాన్ని అది త్వరగా పూర్తి చేసుకుంటుంది. అంటే మనకు ఒక రోజు త్వరగా పూర్తవుతుందనమాట. త్వరగా అంటే గంటల్లో నిమిషాల్లో తేడా ఉండదు, కేవలం మిల్లీ సెకన్లలో మాత్రమే తేడా ఉంటుంది. ఆ మిల్లీ సెకన్ల తేడానే చరిత్రలో ఆ రోజు నిలిచిపోయేలా చేస్తుంది. అయితే ఇలాంటి అరుదైన రోజులు మూడు 2025లోనే ఉండటం మరో విశేషం. ఇప్పటికే ఒక రోజు పూర్తయింది. జులై-9 ఈ ఏడాది అత్యంత చిన్న రోజుగా మిగిలిపోయింది. ఇప్పుడు రాబోతున్న జులై-22 ఈ ఏడాది రెండో అత్యంత చిన్నరోజుగా నమోదు కాబోతోంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. అంతే కాదు, ఆగస్ట్-5 న కూడా భూమి తన వేగం పెంచుకుని రోజు వ్యవధిని తగ్గించడానికి సిద్ధమైంది.
చరిత్రలో చిన్నరోజు..
భూమి వేగం సాధారణంగా ఉంటే తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అంటే 86,400 సెకన్లు అన్నమాట. అయితే అప్పుడప్పుడు భూమి వేగం అనూహ్యంగా మారుతుంది. ఆ సమయంలో రోజుకి ఉన్న సమయం కొన్ని మిల్లీ సెకన్లు తగ్గుతుంది. 1973 నుంచి ఈ లెక్కల్ని పక్కాగా నమోదు చేస్తున్నారు. గతేడాది జులై-5న భూ భ్రమణ కాలం 1.66 సెకన్లు తగ్గింది. ఇప్పటి వరకు చరిత్రలో అదే అతి చిన్న రోజు. కానీ ఈ ఏడాది ఆ రికార్డులకు దగ్గరగా మరికొన్ని జతచేరాయి. 2025 జులై-9న భూమి వేగం పెరగడంతో రోజు 1.36 మిల్లీ సెకన్లు ముందుగానే పూర్తయింది. ఇక ఈ నెల 22(మంగళవారం) కూడా చిన్నరోజు కాబోతోంది. మంగళవారం భూమి తన భ్రమణాన్ని 1.34 మిల్లీ సెకన్లు ముందుగానే పూర్తి చేయబోతోంది. దీనికి కొనసాగింపుగా ఆగస్ట్-5న భూ భ్రమణ కాలం 1.25 మిల్లీ సెకన్లు తక్కువ కాబోతోంది. అంటే ఈ ఏడాది జులై-9, జులై-22, ఆగస్ట్-5 అత్యంత తక్కువ సమయం ఉన్న రోజులుగా పరిగణించబడుతున్నాయి.
మొదట్లో ఇలా..
భూమి ఆవిర్భావం తర్వాత భ్రమణ వేగం మొదట్లో 19 గంటలుగా ఉండేదని తెలుస్తోంది. అంటే అప్పుడు భూమి వేగం చాలా ఎక్కువ అన్నమాట. ఆ తర్వాత వేగం తగ్గి భ్రమణ సమయం పెరిగింది. ఇప్పుడది 24 గంటలకు చేరింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా భూమిపై సముద్ర అలల్లో పోటుపాట్లు ఏర్పడుతాయి. ఈ దృగ్విషయం కూడా భూ భ్రమణ వేగాన్ని నిర్ణయిస్తుందని అంటారు.
ఇప్పుడెందుకిలా?
ఇటీవల కాలంలో భూభ్రమణ వేగంలో స్పష్టమైన మార్పులు కనపడుతున్నాయి. భ్రమణ వేగం పెరిగేకొద్దీ రోజు వ్యవధి మిల్లీ సెకన్ల మేర తగ్గుతూ వస్తోంది. అయితే అన్నిరోజుల్లో ఈ తేడా కనపడ్డం లేదు. గతేడాది జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం, పెరుగుతున్న సముద్ర మట్టాలు.. భూమి యొక్క భ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మరికొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం వాతావరణం, సముద్ర మట్టాలు భ్రమణ వేగాన్ని నియంత్రించలేవని అంటున్నారు. భూమి లోపల ఉన్న పదార్థాల వల్లే వేగంలో స్వల్ప మార్పులు సంభవిస్తున్నాయని చెబుతున్నారు.