Google Layoffs : ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్యం.. ఈ రెండూ టెక్ కంపెనీల్లోని ఉద్యోగస్థుల్లో ఎప్పుడు అలజడి సృష్టిస్తాయో చెప్పలేం. ఎందుకంటే ఈ మాంద్యం భయాల నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు ఒక్కసారిగా వేల, లక్షల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తూ షాక్ ఇస్తుంటాయి. అలా గత ఏడాది మొత్తం ఐటీ రంగం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతూ భారీగా ఉద్యోగుల సంఖ్యకు కోతలు విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ ఏడాది నిజానికి ఈ పరిస్థితి కొంత మారిందనే చెప్పాలి. ఆర్థికంగా పుంజుకోవడంతో కాస్త మార్కెట్‌లో స్థిరత్వం నెలకొంది. అయినప్పటికీ గూగుల్ కొందరు ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చేసింది. ఈ విషయంపై ఓ ఉద్యోగి తీవ్ర భావోద్వోగం వ్యక్తం చేశాడు.
అయితే తాజాగా షా చున్ చెన్ (Shao Chun Chen) అనే గూగుల్‌కు చెందిన మాజీ ఉద్యోగి, తనను గూగుల్ లేఆఫ్ (ఉద్యోగం నుంచి తొలిగించడం) చేయడంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని 2024 వాలంటైన్స్ డే నాడు గూగుల్ లేఆఫ్ చేసింది. అదే రోజు అతడి పుట్టిన రోజు కూడా. అయితే అది జరిగిన ఇన్ని రోజులకు అతడు ఎమోషనల్‌గా స్పందించాడు. లేఆఫ్ చేయడం వల్ల తాను ఎదుర్కొన్న మెంటల్ ఛాలెంజెస్ గురించి వివరించాడు. యాంక్సైటీతో, లోతైన ఆలోచనలు ఎంతగానో భాదించాయని తెలుపుతూ.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపాడు. తాను సంస్థలో ఎంతో విధేయతతో పని చేసినప్పటికీ, అనుభవం ఉన్నప్పటికీ సంస్థ తనను తొలిగించిదని ఎంతో బాధపడ్డాడు.
షా చున్ చెన్ గూగుల్ సంస్థలో 8 ఏళ్ల పాటు పని చేశాడు. 2016లో సింగపూర్ అడ్వటైజర్స్ కోసం అకౌంటెంట్ మేనెజర్‌గా చేరాడు. ఆ తర్వాత ప్రమోషన్ కూడా పొందాడు. అయితే ఈ ఉద్యోగం తనకు కేవలం ఓ ఉద్యోగం మాత్రమే కాదని, తన గుర్తింపులో అంతర్భాగం అని అన్నాడు షా చున్. “మొదట చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఎంతో బాధతో ఉద్యోగాన్ని వీడాను. నా లాయల్టీ (విధేయత), అనుభవం వాళ్లకు సరిపోలేదా? అసలు లేఆఫ్ నుంచి నన్ను ఈ రెండు ఎందుకు కాపాడలేకపోయాయో?” అని ప్రశ్నించాడు.
అయితే కంపెనీ తనకు ఇతర డీ ప్రమోషన్ ఆఫర్లను ఇచ్చిందని తెలిపాడు షా చున్. కానీ వాటిని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. ఆ బాధ్యతలు తనకు కరెక్ట్ కావని తాను భావించినట్లు చెప్పుకొచ్చాడు. అర్హత కంటే తక్కువ స్థాయిలో తాను పనిచేయలేనని తెలిపాడు.
మొత్తంగా ఈ లేఆఫ్ బాధ నుంచి బయట పడటానికి సోలోగా జపాన్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలిపాడు షా చున్. అక్కడి పర్వతాల మధ్య ప్రశాంతతను పొందినట్లు చెప్పుకొచ్చాడు. ఈ బ్రేక్ తనకు కలిగిన బాధ నుంచి ఉపశమనాన్ని అందించినట్లు తెలిపాడు. ఇప్పుడు తాను సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో కన్సల్టింగ్ బిజినెస్ టీచింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
ALSO READ : సోషల్ మీడియా.. ఇలా వాడితే మీ లైఫ్ వెరీ సేఫ్!