Gen Z Humour: ఇప్పటి తరానికి నవ్వడమంటే కేవలం సరదా మాత్రమే కాదు. కష్టమైన విషయాలను, లోతైన సమస్యలను పంచుకోవడానికి జెన్ జీ వాడుతున్న అతిపెద్ద ఆయుధం హాస్యం. ఇటీవల స్నాప్‌చాట్, ఆమ్నికామ్ అడ్వర్టైజింగ్ కలిసి నిర్వహించిన ఒక ఆసక్తికరమైన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. మనదేశంలో దాదాపు 87 శాతం మంది యువత సీరియస్ అంశాల గురించి మాట్లాడటానికి నవ్వునే ఒక సాధనంగా వాడుతున్నారని ఈ పరిశోధన చెబుతోంది. డిప్రెషన్, కెరీర్ భయాలు, మానసిక ఒత్తిడి వంటి పెద్ద పెద్ద విషయాలను కూడా ఒక చిన్న మీమ్ లేదా జోక్‌తో చాలా సులువుగా ఇతరులకు చెప్పేస్తున్నారు.
ఇప్పుడున్న యువతకి హాస్యం అనేది కేవలం జోకులు వేసుకోవడానికే పరిమితం కాలేదు. బయటకు నేరుగా చెప్పలేని అనేక భావాలను నవ్వుల చాటున వ్యక్తపరుస్తున్నారు. ఉద్యోగం దొరక్కపోవడం, పని ప్రదేశంలో ఒత్తిడి, సంబంధాల్లో వచ్చే సమస్యలను నేరుగా చెబితే వచ్చే భారం కంటే.. ఒక చిరునవ్వుతో పంచుకుంటే తేలికవుతుందని వీరు భావిస్తున్నారు. అందుకే కష్టమైన పరిస్థితుల్లో కూడా వీరు హాస్యాన్నే ఒక రక్షణ కవచంగా మార్చుకుంటున్నారు.
Also Read: వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!
నేటి యువతను ఆకట్టుకోవడానికి పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా తమ శైలిని మార్చుకుంటున్నాయి. సర్వే ప్రకారం 91 శాతం మంది జెన్ జీ యువత హాస్యభరితంగా ఉండే ప్రకటనల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. బ్రాండ్లు తమ భాషను బలవంతంగా అనుకరించడానికి ప్రయత్నిస్తే యువతకు నచ్చడం లేదు. తమ భావాలను, సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకుని మాట్లాడే కంపెనీలకే వీరు ఎక్కువ ఓటు వేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లేదా మీమ్ వచ్చిందంటే దానికి ఎంతో కొంత ఆయుష్షు ఉంటుంది. సమయం దాటిపోయాక దానిని వాడితే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎలా జోక్ వేయాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం చాలా అవసరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఏ వేదికపై ఎలాంటి భాష వాడాలో సరిగ్గా ప్లాన్ చేసుకుంటేనే జనాల్లోకి త్వరగా చేరువ కాగలరని చెబుతోంది.
నేటి తరానికి హాస్యం అనేది ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసే సోషల్ కరెన్సీ లాంటిది. ఒక్క మీమ్ షేర్ చేయడం ద్వారా ‘నేను కూడా నీ లాగే ఆలోచిస్తున్నాను’ అనే నమ్మకాన్ని ఇస్తున్నారు. మాటల్లో చెప్పలేని పెద్ద సమస్యలను కూడా నవ్వుతో చిన్నవిగా మార్చేస్తూ.. సమాజంలో ఒక కొత్త రకం భావప్రకటన స్వేచ్ఛకు జెన్ జీ బాటలు వేస్తోంది.
Also Read: రూ.9,999 బడ్స్ ఇప్పుడు రూ.3,399కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దిమ్మతిరిగే డీల్!