Google Nest Hub: వంటింట్లో బిజీగా వంట చేస్తున్నప్పుడు లేదా పనుల్లో మునిగిపోయినప్పుడు టీవీలో మనకు ఇష్టమైన మ్యాచ్ లేదా షో వస్తుంటే చూడటం కాస్త కష్టమే. ఫోన్ పక్కన పెట్టి చూద్దామంటే చేతులకు పిండి లేదా మసాలాలు అంటుకుని ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పాత గూగుల్ హోమ్ లేదా నెస్ట్ హబ్ డిస్‌ప్లే మీకు బాగా ఉపయోగపడుతుంది. కేవలం వాయిస్ కమాండ్‌తో వంట గదిలోనే లైవ్ టీవీ లేదా పాటలను హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.
వంటింట్లో పని చేసుకుంటూనే యూట్యూబ్ టీవీలో ఈఎస్పీఎన్ వంటి స్పోర్ట్స్ ఛానెల్స్ లేదా ఇతర షోలు చూడటానికి గూగుల్ నెస్ట్ హబ్ సెట్ అవుతుంది. ‘హే గూగుల్.. వాచ్ టీవీ’ అని నోటితో చెబితే చాలు.. స్క్రీన్‌ను తాకాల్సిన అవసరం లేకుండానే కోరుకున్న ఛానెల్ ప్లే అవుతుంది. 7 అంగుళాల లేదా 10 అంగుళాల నెస్ట్ హబ్ మాక్స్ స్క్రీన్లు వంటగది కౌంటర్‌టాప్‌పై పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు టచ్‌స్క్రీన్ ద్వారా కూడా సౌండ్ పెంచడం, ఛానెల్స్ మార్చడం వంటివి సులభంగా చేయవచ్చు.
Also Read: యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?
ఈ గూగుల్ డిస్‌ప్లేలు కేవలం యూట్యూబ్ టీవీకే పరిమితం కాదు. ఇందులో గూగుల్ కాస్ట్ టెక్నాలజీ ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి ప్రముఖ వీడియో, ఆడియో స్ట్రీమింగ్ యాప్‌లను నేరుగా ప్లే చేసుకోవచ్చు. ఆఫీస్ రూమ్‌లో పని చేస్తూ వార్తలు చూడటానికి లేదా సాయంత్రం వేళల్లో పాటలు వినడానికి ఇది సెకండరీ స్క్రీన్‌లా పనిచేస్తుంది. ఒకవేళ యూట్యూబ్ టీవీ సరిగ్గా పనిచేయకపోతే గూగుల్ అసిస్టెంట్‌ను ‘జెమిని ఫర్ హోమ్’కి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
గూగుల్ హోమ్ డిస్‌ప్లేను ఇంట్లోని హాల్లో ఒక డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లా కూడా మార్చుకోవచ్చు. ఇంట్లో ఉండే పెద్దవారికి లేదా తల్లిదండ్రులకు తమ పిల్లలు, మనవళ్ల ఫోటోలను ఎప్పటికప్పుడు చూపించడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. గూగుల్ ఫోటోస్ ద్వారా ఒక షేర్డ్ ఆల్బమ్ క్రియేట్ చేస్తే.. దూరంగా ఉండే కుటుంబ సభ్యులు అందులో అప్‌లోడ్ చేసే ఫోటోలు నేరుగా ఈ డిస్‌ప్లేపై కనిపిస్తాయి. ఇది పాత పరికారానికి కొత్త జీవం పోయడమే కాకుండా ఇంట్లో అందరికీ తీపి గుర్తుగా మారుతుంది.
ఈ స్మార్ట్ డిస్‌ప్లేలను ఇంటి భద్రత కోసం కూడా వాడుకోవచ్చు. స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు లేదా డోర్‌బెల్స్‌ను దీనికి కనెక్ట్ చేస్తే.. ఇంటి బయట ఎవరు ఉన్నారో లేదా డోర్ దగ్గరకు ఎవరు వచ్చారో సులభంగా చూసేయవచ్చు. అలాగే చిన్న పిల్లలు ఉన్నవారు నానిట్ ప్రో వంటి కెమెరాలను అనుసంధానించి దీనిని బేబీ మానిటర్‌గా ఉపయోగించవచ్చు. పాప లేదా బాబు పడుకున్నారా లేదా అనేది వేరే గదిలో ఉండి కూడా డిస్‌ప్లేలో గమనించవచ్చు. ఇలా పాత డిస్‌ప్లేను వేస్ట్‌గా పడేయకుండా ఇంటికి కావాల్సిన స్మార్ట్ డివైజ్‌లా మార్చేసుకోవచ్చు.
Also Read: ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!