Google Cloud Outage| ప్రముఖ సెర్చె ఇంజిన్ గూగుల్ అందించే క్లౌడ్ సేవలు జూన్ 12, గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని సైట్ ఔటేజ్ డిటెక్టర్ అయిన డౌన్‌డిటెక్టర్.కామ్ ధృవీకరించింది. అయితే, గూగుల్ క్లౌడ్ అధికారికంగా మాత్రం “పెద్ద సమస్యలేవీ లేవు” అని పేర్కొంది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11,000 కంటే ఎక్కువ మంది గూగుల్ క్లౌడ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.
సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ సమస్యపై జోకులు వేస్తూ.. వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “గూగుల్ క్లౌడ్: ‘పెద్ద సమస్యలు లేవు’… నిజంగానా?” అని రాశారు. మరొకరు.. “గూగుల్ క్లౌడ్ అంతరాయం లేదు. అది మీ ఊహే” అని వెబ్‌సైట్ స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. “గూగుల్ క్లౌడ్ స్టేటస్ పేజీకి వారి సర్వీస్ డౌన్ అయిన విషయం ఎలాగో చివరికి తెలిసిందే..” అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకొక నెటిజెన్ అయితే.. “కోడింగ్ చేస్తుండగా CORS ఎర్రర్‌లు వచ్చాయి. బ్యాక్ ఎండ్‌ను ముట్టుకోలేదు. సూపాబేస్‌లో టేబుల్స్ లోడ్ కావడం లేదు. ట్విట్టర్ Xలో చూస్తే గూగుల్ క్లౌడ్ డౌన్ అయినట్లు కనిపించింది. ఏం జరుగుతోంది?” అని రాశారు.
గురువారం రాత్రి.. గూగుల్ జెమినీ, క్లౌడ్‌ఫ్లేర్, ఫైర్‌బేస్ వంటి ఇతర సేవలూ నిలిచిపోయాయి. గూగుల్ క్లౌడ్‌పై ఆధారపడే జిమెయిల్, డ్రైవ్, స్పాటిఫై, గూగుల్ మీట్ వంటి అప్లికేషన్‌లలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఒకరు సరదాగా ఈ ఔటేజ్ పై స్పందిస్తూ.. “గూగుల్ క్లౌడ్: ‘పెద్ద అంతరాయం అంటే ఫ్రాన్స్‌లోని ఔటాజ్ ప్రాంతం నుంచి రావాలి” అని రాశారు.
ఈ అంతరాయం ఎందుకు కలిగిందో.. గూగుల్ స్పందనలో వివరణ ఇచ్చింది. ఈ అంతరాయానికి కారణం గూగుల్ క్లౌడ్‌లోని ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ (IAM) సిస్టమ్‌లో వైఫల్యం. ఈ సమస్య గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్, క్యాలెండర్, మీట్, లెన్స్ వంటి సేవలతో పాటు స్పాటిఫై, డిస్కార్డ్ వంటి మూడవ పక్ష సేవలను కూడా ప్రభావితం చేసింది. జూన్ 12 తెల్లవారుజామున ప్రారంభమైన ఈ అంతరాయంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఆందోళన చెందారు.
Also Read: గూగుల్ ఎఐలో లోపాలు.. తప్పుడు సలహాలు, ప్రమాదకర సూచనలు
గూగుల్ ఇంజనీర్లు ఈ సమస్యను గుర్తించి.. తగిన పరిష్కారాలను వర్తింపజేసి సేవలను పునరుద్ధరించారు. “అన్ని సేవలు పూర్తిగా రిస్టోర్ చేశాం. పూర్తి విశ్లేషణను త్వరలో ప్రచురిస్తాం” అని గూగుల్ తెలిపింది. ఈ సంఘటన వ్యాపారాలు, వినియోగదారులు పెద్ద సంస్థల సేవలపై ఎంతగా ఆధారపడుతున్నారో, సాంకేతిక వైఫల్యాలను తగ్గించేందుకు బ్యాకప్ వ్యవస్థల అవసరాన్ని చూపించింది.
గతంలో మార్చి 2025లో కూడా గూగుల్ క్రోమ్‌కాస్ట్‌లో సమస్యలు ఎదురయ్యాయి. గూగుల్ క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసి, ఆ తరువాత గూగుల్ టీవీ స్ట్రీమర్‌ను లాంచ్ చేసింది.