Internet Data Tax| భారతదేశంలో చాలా మంది ప్రతిరోజు వీడియోలు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ కోసం మొబైల్ డేటా వినియోగిస్తున్నారు. అందుకే మొబైల్ డేటా ఇప్పుడు ఒక విధంగా నిత్యావసరంగా మారింది. కానీ త్వరలో మొబైల్ డేటా ఉపయోగంపై ప్రభుత్వం కొత్త టాక్స్ విధించే అవకాశం ఉంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. ప్రభుత్వం ఈ పన్ను విధింపు నిర్ణయాన్ని పరిశీలిస్తోంది. ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అందుకే భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం మొబైల్ డేటా ఉపయోగంపై టాక్స్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ టాక్స్ భారతదేశంలో ఎలా అమలు విధాపంపై ప్రతిపాదనలు చేయాలని టెలికాం శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టెలికాం శాఖ ట్యాక్స్ విధింపుపై అధ్యయనం చేస్తోంది. ఈ టాక్స్.. వినియోగదారులు, టెలికాం కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉంటుంది.
ఇటీవల జరిగిన టెలికాం సెక్టార్ రివ్యూ మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. డిజిటల్ సేవల నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచే వివిధ మార్గాల గురించి చర్చించారు. ఆ తర్వాత టెలికాం శాఖకు మొబైల్ డేటా టాక్స్ ప్రతిపాదనను వివరంగా పరిశీలించమని ఆదేశించడం జరిగింది. టెక్నికల్, ఆర్థిక, రెగ్యులేటరీ అంశాలను అధ్యయనం చేసి సిఫార్సులు ఇవ్వాలని సూచనలు అందాయి.
కొన్ని రిపోర్టుల ప్రకారం.. ప్రతి GB (గిగాబైట్) డేటా వినియోగంపై రూ.1 టాక్స్ విధించే ఆలోచన ఉంది. ఇలా అమలు చేస్తే డేటా వినియోగించే ప్రతి యూజర్ ఈ అదనపు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ట్యాక్స్ నిర్ణయం ఇంకా చర్చ దశలోనే ఉంది. ఎలాంటి అధికారిక నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
ఈ టాక్స్ అమలైతే ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. లక్షలాది మంది రోజూ ఎక్కువ డేటా వినియోగిస్తున్నారు. కాబట్టి ప్రతి యూజర్ చిన్న మొత్తంలో టాక్స్ చెల్లించినా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. అయితే యూజర్లపై పడే భారాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ ధరలు ప్రపంచంలోనే అతి తక్కువ. ఈ చౌక ధరల వల్ల చాలా మంది డిజిటల్ సేవలు వినియోగించడం మొదలుపెట్టారు. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్స్ వల్ల డేటా వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు యూజర్లు 18 శాతం GST చెల్లిస్తున్నారు. ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, పోస్ట్‌పెయిడ్ బిల్లులపై ఈ GST వర్తిస్తుంది. కాబట్టి టెలికాం సేవల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఇప్పటికే వస్తోంది. కొత్త డేటా టాక్స్ వస్తే అది అదనపు ఛార్జ్ అవుతుంది.
Also Read: చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి
ప్రభుత్వం ఇంకా ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. టెలికాం శాఖకు వివరంగా అధ్యయనం చేయమని ఆదేశాలు మాత్రమే ఇచ్చింది. లాభనష్టాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం మొబైల్ డేటా టాక్స్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.