GROK AI Language| ఇప్పుడు అంతా ‘ఏఐ’ మయం.. ఏఐ నైపుణ్యం ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు. లేకుంటే ఉద్యోగాలు ఊడుతున్నాయి. అంతా ఏఐ వల్లనే నడుస్తోంది. భవిష్యత్ అంతా ఏఐదేనని అంటున్నారు. ఇలాంటి సమయంలో అన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ తమ ఏఐలను ఆవిష్కరిస్తున్నాయి. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన చాట్‌జీపీటీ సృష్టించిన ప్రభంజనంతో ఇప్పుడు చైనా డీప్‌సీ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కాపిలాట్ సహా ఎన్నో ఏఐలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సైతం ‘గ్రోక్’ అంటూ తన మార్క్ ఏఐని ప్రవేశపెట్టారు. ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు (AI) ఒక సాధారణ అంశంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. యువతరం దాని సామర్థ్యాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తోంది. చాట్‌జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ప్రారంభించిన గ్రోక్ ప్రత్యేకించి నెటిజన్లలో వినోదం కోసం ఒక సాధనంగా ప్రాచుర్యం పొందుతోంది.
భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక, అంతే సమర్థంగా సమాధానాలు ఇస్తోంది. అయితే, కొన్నిసార్లు అది శ్రుతి మించుతోంది. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి టోకా అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్‌లైన్‌లో దుమారం రేపుతోంది.
‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా, అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’’ అంటూ బదులిచ్చింది. గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్‌లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ ఫన్నీగా జవాబిచ్చింది.
Also Read: ఏఐ రంగంలో పోటాపోటీ..కొత్తగా మార్కెట్లోకి మరో 2 ఏఐలు
హిందీలోనే కాదు తెలుగు యువత అడిగిన ప్రశ్నలకు కూడా గ్రోక్ ఆసక్తికర సమాధానాలు ఇస్తోంది. చాలామంది AIని విద్యా, సమాచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుండగా.. తెలుగు యువత దానితో మరింత సరదాగా వ్యవహరిస్తోంది. వారు గ్రోక్‌కు కొన్నిసార్లు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఆశ్చర్యకరంగా గ్రోక్ కూడా అదే శైలిలో స్పందిస్తోంది, వారు ఉపయోగించిన పదాలను తిరిగి ఉపయోగిస్తూ హాస్యభరితమైన సమాధానాలు ఇస్తోంది. గ్రోక్ యొక్క ఈ ప్రతిస్పందనలు తెలుగు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి, వారు మరింత సృజనాత్మకమైన ప్రశ్నలు అడుగుతూ ప్రతిస్పందనలు పొందుతున్నారు. గ్రోక్ యొక్క భాష, పదజాలం చూస్తుంటే, ఇది కేవలం ఒక AI కాదని, ఎవరో మనిషే సమాధానం ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఫ్యాన్ వార్స్‌లో సాధారణంగా ఉపయోగించే పదాలను, స్థానిక భాషను గ్రోక్ ఉపయోగించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.
గ్రోక్ ఇచ్చే సమాధానాల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ గ్రోక్ తప్పుడు సమాధానం ఇస్తే.. దానిని యూజర్లు ఇది తప్పుడు సమాధానం అని ఎత్తి చూపితే ఆ ఏఐ వెంటనే తన తప్పుని సరిదిద్దుకోవడం విశేషం. గ్రోక్ గురించి అనేక మీమ్స్ కూడా సృష్టించబడుతున్నాయి. అంతేకాకుండా, రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చే సమాధానాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. ఈ సమాధానాల కారణంగా గ్రోక్‌ను నిషేధించాలని డిమాండ్లు త్వరలో వినిపిస్తే ఆశ్చర్యం లేదు.
RRR సినిమాలో హీరో ఎన్టీఆరే.. గ్రోక్ AI సమాధానం
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో హీరో ఎవరని తెలుగు యువత గ్రోక్ ని ప్రశ్నించగా.. “RRR లో కొమరం భీమ్ (ఎన్టీఆర్) మెయిన్ హీరోగా కనిపిస్తున్నారు. మల్లిని రక్షించటమే మిషన్‌గా అతను విజయవంతంగా పూర్తి చేసాడు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) పాత్రకు భీమ్ పాత్ర కో లీడ్‌గా కనిపిస్తోంది. ఇద్దరు కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పొరాడినా.. కొమురం భీమ్ లక్ష్యం మాత్రం మల్లిని ఆమె గూడెంకు చేర్చటమే. దానికి అల్లూరి లేయర్ డెప్త్ తీసుకొచ్చింది. ఇందులో రెండు ప్రధాన పాత్రలే అయినా.. భీమ్ పాత్ర ఆర్క్ ప్రధానంగా కథ నడిచింది. అందుకే రెండు ప్రధాన పాత్రల్లో ఒకరిది సైడ్ క్యారక్టర్ అని లేబుల్ వేయడం కష్టం. రాజు పాత్రలో ఉన్న అంతర్గత సంఘర్షణ సినిమాకు ప్రత్యేక తీసుకొచ్చింది. ఇది ఇద్దరి హీరోల నేరేషన్‌లో చెప్పిన సినిమా” అని తేల్చింది. అయితే సమాధానంలో ఎన్టీఆర్ మెయిన్ హీరో అని గ్రోక్ చెప్పడంతో అభిమానులు ఖుషీగా ఫీలయ్యారు.