New Phone Security Settings| కొత్త ఫోన్ కొన్నాక చాలా మంది వెంటనే ఉపయోగించడం మొదలుపెడతారు. కానీ ఇలా చేయడం వల్ల మీ పర్సనల్ డేటా సైబర్ దొంగల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్ సెటప్ సమయంలోనే ముఖ్యమైన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయాలి. ఇవి ఫోన్ దొంగతనం లేదా కోల్పోయినప్పుడు రక్షణ ఇస్తాయి.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో సెక్యూరిటీ ఫీచర్లను వెంటనే ఆన్ చేయాలని ముఖ్యమైన సూచనలు చేసింది. డేటా దొంగతనం, సిమ్ దుర్వినియోగం, వ్యక్తిగత సమాచారం దొంగలు కాజేయడం వంటి ప్రమాదాలను హెచ్చరించింది. ఈ ప్రమాదాలను నివారించడానికి వెంటనే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే సెక్యూరిటీ రిస్క్ చాలా తగ్గుతుంది.
ఫోన్ కోల్పోయినా లేదా దొంగిలించబడినా గుర్తించడానికి ‘Find My Device’ ఫీచర్ చాలా ముఖ్యం. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సెట్టింగ్ డిఫాల్ట్‌గా ఉంటుంది. సెట్టింగ్స్ మెనులో వెళ్లి దీన్ని యాక్టివేట్ చేయాలి. GPS, ఇంటర్నెట్ సాయంతో ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. దీంతో ఫోన్ తిరిగి పొందే అవకాశాలను పెరుగుతాయి.
రిమోట్ లాక్ ఫీచర్ దూరం నుంచి ఫోన్‌ను లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆఫ్‌లైన్ డివైస్ ట్రాకింగ్ కూడా ఆన్ చేయాలి. ఫోన్ ఆఫ్ చేసినా కూడా గుర్తించవచ్చు. ఇవి అత్యవసర సమయంలో ఫోన్‌పై కంట్రోల్ ఇస్తాయి.
లాక్ స్క్రీన్‌పై OTP, మెసేజ్‌లు కనిపిస్తే ఇతరులు చదవవచ్చు. కాబట్టి సెన్సిటివ్ నోటిఫికేషన్లను లాక్ స్క్రీన్‌లో చూపించవద్దు. నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లో వెళ్లి ‘Hide sensitive content’ ఆప్షన్ ఆన్ చేయాలి.
Realme, Oppo, OnePlus వంటి బ్రాండ్లలో “Request Password to Power Off” ఫీచర్ ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే దొంగలు సులభంగా ఫోన్ ఆఫ్ చేయలేరు. ఈ ఫీచర్ లొకేషన్ ట్రాకింగ్‌ను కొనసాగించడానికి సహాయపడుతుంది.
సిమ్ లాక్ ఫీచర్ సిమ్ కార్డును అనధికారిక వినియోగం నుంచి రక్షిస్తుంది. నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో వెళ్లి సిమ్ లాక్ ఆన్ చేయాలి. PIN అడిగినప్పుడు మాత్రమే సిమ్ ఉపయోగించవచ్చు. ఇది సిమ్ స్వాప్ మోసాలను నివారిస్తుంది.
Also Read: మెదడుతో ల్యాప్‌టాప్ కంట్రోల్ చేసిన యువకుడు.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే
ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మీ డేటా, బ్యాంక్ వివరాలు, గుర్తింపును రక్షిస్తాయి. డేటా లీక్, ఆర్థిక మోసాలు తగ్గుతాయి. ఫోన్ కోల్పోయినా త్వరగా తిరిగి పొందవచ్చు. సాధారణ సెటప్ దశలతోనే భద్రత పెంచుకోవచ్చు.
కొత్త ఫోన్ కొన్నాక సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీ ఫోన్‌కు ఇన్సూరెన్స్‌తో సమానం. ఇవి మీ సేఫ్టీ, ప్రైవసీ కాపాడడంతో పాటు మనశ్శాంతి కూడా ఇస్తాయి. అందరూ ఈ సలహాలు పాటించాలని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సూచిస్తోంది. ఫోన్ కొనగానే ఉపయోగించడానికి ముందే మీ ఫోన్ భద్రపరచుకోండి.