CNAP Service: భారత్‌లో నవంబర్ 1వ తేదీ నుంచి మొబైల్ వినియోగదారుల కోసం కీలకమైన మార్పు అమల్లోకి రానుంది. దేశంలో ఎవరైనా అపరిచిత నంబర్ (Unknown Number) నుంచి కాల్ చేస్తే, ఆ వ్యక్తి ఎవరో గుర్తించడం ఇకపై చాలా సులభం కానుంది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.. టెలికాం కంపెనీలన్నీ ‘కాల్-నేమ్ ప్రెజెంటేషన్’ (CNAP – Caller Name Presentation) సేవలను అందుబాటులోకి తేనున్నాయి. ఈ కొత్త రూల్, దాని పనితీరు, యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ఇప్పటివరకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎవరివో తెలుసుకోవడానికి చాలామంది ‘ట్రూకాలర్’ (Truecaller) వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడేవారు. అయితే ఈ యాప్‌లు చూపించే పేర్లు నూటికి నూరు శాతం కరెక్ట్ అనే చెప్పే వ్యవస్థ ఇన్నాళ్లు ఏదీ లేదు. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం ఈ సీఎన్ఏపీ (CNAP) వ్యవస్థను తీసుకొస్తోంది. ఇకపై ఎలాంటి యాప్‌ల అవసరం లేకుండానే మొబైల్ స్క్రీన్‌పై కాల్ చేస్తున్న వ్యక్తి అసలు పేరు ప్రత్యక్షం కానుంది.
టెలికాం శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మొదటి దశలో భాగంగా 4G, 5G నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఈ సీఎన్ఏపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 1 నుంచి ఆయా నెట్ వర్క్ యూజర్లకు ఇన్ కమింగ్ కాల్ రాగానే అవతలి వ్యక్తి పేరు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించనుంది. రాబోయే రోజుల్లో ఈ సేవలను 2G, 3G నెట్‌వర్క్ యూజర్లకు సైతం విస్తరించనున్నట్లు టెలికాం వర్గాలు స్పష్టం చేశాయి.
వినియోగదారుడి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు.. ఈ సీఎన్ఏపీ వ్యవస్థ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. కాల్ చేసే వ్యక్తి సిమ్ కార్డు తీసుకునే సమయంలో టెలికాం కంపెనీకి అందించిన అధికారిక గుర్తింపు కార్డు ఆధారంగా నమోదైన పేరు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ కాల్ విదేశాల నుంచి వస్తుంటే స్క్రీన్‌పై వ్యక్తి పేరుకు బదులుగా ‘ఇంటర్నేషన్ కాల్’ అని చూపిస్తుందని టెలికాం వర్గాలు తెలిపాయి.
Also Read: ఆఫీస్, షాపు లేకుండానే ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు.. ఈ GST నిబంధన గురించి తెలుసా?
ఇదిలా ఉంటే ఈ రోజుల్లో తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంక్ అధికారులమని, లాటరీ వచ్చిందని చెప్పి అమాయకులను బురిడీ కొట్టించే ముఠాలకు ఈ కొత్త నిబంధన పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కాల్ చేసే వ్యక్తి అసలు పేరు స్పష్టంగా కనిపించడం వల్ల ఆన్‌లైన్ ఫ్రాడ్స్, వేధింపులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: అభిషేక్ బ్యాటింగ్ తలచుకుని, న్యూజిలాండ్ బౌలర్లు నిద్రలోనూ ఉలిక్కిపడతారు