Hyderabad’s New Mobility Plan: హైదరాబాద్ లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు మెట్రో ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మరో ప్రతిపాదనను పరిశీలిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీస్ లు, నివాస ప్రాంతాలు, ఇతర ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS)ను అందుబాటులోకి తీసుకురావడంపై అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే ప్రయాణికులకు లాస్ట్ మైల్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL), కన్సల్టెంట్ సంస్థ ఎల్ఈఏ అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై టెక్నకిల్, ఫైనాన్షియల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు ప్రధాన కారిడార్లను గుర్తించారు. మొదటి కారిడార్‌లో రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కూకట్‌పల్లి ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఐటీ ఉద్యోగులు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం ఈ మార్గంలో కీలక అంశంగా ఉండనుంది. రెండో కారిడార్ సచివాలయం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతిపాదించారు. ఇందులో హుస్సేన్‌సాగర్, బేగంపేట, అసెంబ్లీ, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ప్రతిపాదిత పీఆర్‌టీఎస్ నెట్ వర్క్ పై ఇటీవల నిర్వహించిన వర్క్ షాప్‌లో పలు అంశాలను చర్చించారు. ప్రయాణికుల సంఖ్య ఎంత ఉండొచ్చు? మార్గాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి? డిపోలకు అనువైన ప్రదేశాలేవి? నిర్మాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే అంశాలపై అధికారులు, నిపుణులు చర్చించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పీఆర్‌టీఎస్ ద్వారా మెట్రో వినియోగం పెరగడంతో పాటు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వర్క్ షాప్‌కు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్‌ఆర్‌టీసీ, దక్షిణ మధ్య రైల్వే తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి చివరి గమ్యస్థానం వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే పరిష్కారాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అధ్యయనం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టును అమలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం మెట్రో స్టేషన్‌కు చేరుకోవడానికి, అక్కడి నుంచి ఆఫీస్, ఇంటికి వెళ్లడానికి చాలామంది ఆటోలు, క్యాబ్‌లు, బస్సులపై ఆధారపడుతున్నారు. పీఆర్‌టీఎస్ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణానికి ప్రత్యామ్నాయం లభించే అవకాశం ఉంది. అయితే, ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ సాంకేతికతను ఉపయోగిస్తారు? ప్రయాణ ఛార్జీలు ఎంత ఉంటాయి? అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తుది ప్రణాళిక, ప్రభుత్వ ఆమోదం, అమలు షెడ్యూల్ వెల్లడైన తర్వాతే హైదరాబాద్ ప్రయాణికులకు ఇది ఎలాంటి మార్పు తీసుకురానుందో వెల్లడికానుంది.
Read Also: యూరప్ రైళ్ల కంటే వందే భారత్ బెటర్.. పోలాండ్ యువతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!