Microsoft In India : టెక్ రంగంలో ఏటికేటా దూసుకుపోతున్న భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ దిగ్గజ టెక్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రముఖ టెక్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్.. భారత్ లో కీలక పెట్టుబడుల్ని ప్రకటించింది. ఇక్కడి క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను విస్తరించేందుకు ఏకంగా 3 బిలియన్ డాలర్లను అంటే భారత్ కరెన్సీలో రూ.27,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని బెంగళూరులో స్టార్టప్ పౌండర్స్, ఎగ్జిక్యూటివ్ లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ సీఈఓ సత్యా నాదేళ్ల వెల్లడించారు. అందుకు ముందు రోజే.. సత్యా నాదేళ్ల ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ప్రస్తుత పెట్టుబడులతో.. దేశంలో టెక్ రంగం మరింత మందికి ఉపాధీ అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని నిపుణులు అంటున్నారు.
మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ల పెట్టుబడి
అంతర్జాతీయంగా సంస్థ కార్యకలాపాల్ని విస్తరించడంతో పాటు వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా.. మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడుల్ని పెట్టేందుకు సిద్ధమైంది. కాగా.. మైక్రోసాఫ్ట్ నికర విలువ 3.181 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద కంపెనీగా ఉంది. ఈ సంస్థ భారత్ లో మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా.. అజూర్ క్లౌడ్ ద్వారా సేవలందిస్తోంది. దీనికి దాదాపు 300 కంటే ఎక్కువ డేటా సెంటర్‌లు ఉన్నాయి. ఈ సంస్థ ద్వారా సేవలందిస్తున్న తన సంస్థలో సామర్థ్యాలను పెంపొందించడం, దేశవ్యాప్తంగా కొత్త ప్రాంతీయ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టనుంది.
భారత్ తో ప్రస్తుతం 17 మిలియన్ల డెవలపర్లు GitHubలో క్రియాశీలకంగా ఉన్నారని, 2028 నాటికి అతిపెద్ద డెవలపర్‌ల హబ్‌గా మారుతుందని సత్య నాదెళ్ల అన్నారు. కాగా .. దేశంలో ప్రస్తుతం అదనంగా మరో 30,500 పైగా AI ప్రాజెక్ట్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయని, ఇవి సాంకేతిక రంగంలోని వేగవంతమైన వృద్ధికి దోహద పడతాయని అన్నారు.
10 మిలియన్ల మందికి AI శిక్షణ
దేశంలోని 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో శిక్షణ అందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ప్రతి వ్యక్తి, సంస్థకు సాధికారత కల్పించే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణలలో అవకాశాలను అందుకునేందుకు భారతకున్న విస్తారమైన మానవ వనరులు ఎంతో కీలకమని సత్య నాదెళ్ల అన్నారు. సాంకేతికతలో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని అన్నారు.
Also Read : వాట్సాప్ లో AI ఇమేజెస్.. క్రియోట్ చేసేయండిలా!
ఈ విస్తరణ భారతదేశంలో తన కార్యకలపాల్ని బలోపేతం చేయడంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. కాగా.. ఇది ఇప్పటి వరకు దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడిగా చెబుతున్నారు. ఈ గణనీయమైన పెట్టుబడి ద్వారా భారతదేశ వృద్ధి, ఆవిష్కరణలకు దోహదపడే అవకాశం గురించి నాదెళ్ల హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం భారతదేశంలో మూడు డేటా సెంటర్ రీజియన్‌లను నిర్వహిస్తోంది, 2026 నాటికి నాలుగోది కూడా ప్రారంభించాలని భావిస్తోంది.