ThumbPay| భారతదేశంలో చెల్లింపుల విధానం UPI ద్వారా పూర్తిగా మారిపోయింది. చిన్న రోడ్డు సైడ్ దుకాణం నుంచి పెద్ద మాల్ వరకు ఎక్కడైనా QR కోడ్‌లను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇందు కోసం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ డేటా అవసరం. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. గురుగ్రామ్‌లోని IoT స్టార్టప్ ప్రాక్సీ (Proxgy) ఈ సమస్యకు ‘థంబ్‌పే’ ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తోంది.
థంబ్‌పే అంటే ఏమిటి?
థంబ్‌పే అనేది బయోమెట్రిక్ చెల్లింపు పరికరం. ఇందులో QR కోడ్‌లు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం లేదు. కేవలం వేలిముద్ర లేదా బొటనవేలిని పరికరంపై ఉంచితే చాలు. ఈ పరికరం ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాకు నేరుగా కనెక్ట్ అవుతుంది. UPI ద్వారా తక్షణమే డబ్బును ఖాతా నుంచి కట్ అవుతుంది. మీ వద్ద క్యాష్ , ఫోన్ లేకుండానే చెల్లింపులు సాధ్యమవుతాయి.
థంబ్‌పే ఎలా పనిచేస్తుంది?
ఈ పరికరం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) ద్వారా వినియోగదారుని గుర్తింపును ధృవీకరిస్తుంది. వినియోగదారుడు తన బొటనవేలిని పరికరంపై ఉంచితే, AEPS వేలిముద్రను ధృవీకరిస్తుంది. UPI ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసివేయబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా త్వరగా, కొన్ని సెకన్లలో పూర్తవుతుంది.
విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్
ప్రాక్సీ థంబ్‌పేను నియంత్రిత వాతావరణంలో పైలట్ ప్రాజెక్ట్‌గా విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుతం.. UIDAI, NPCI నుంచి అనుమతులు పొందే ప్రయత్నంలో ఉన్నారు. అనుమతులు పొందిన తర్వాత, ఈ పరికరాన్ని మొదట పెద్ద బ్యాంకులతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. తర్వాత ఫిన్‌టెక్ కంపెనీలు చిన్న వ్యాపారాలకు కూడా ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
థంబ్‌పే ఎందుకు కీలకం
ఈ బ్యాటరీతో నడిచే పరికరానికి నిరంతర విద్యుత్ సరఫరా లేదా స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. ఇది తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు, చిన్న మార్కెట్లు, మరియు గ్రామీణ ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ధర ₹2,000 కంటే తక్కువ, ఇది చాలా మందికి అందుబాటులో ఉంటుంది.
ప్రాక్సీ ఏమి చెబుతోంది?
ప్రాక్సీ CEO పుల్కిట్ అహుజా మాట్లాడుతూ.. థంబ్‌పే భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తుగా ఉంటుందని అన్నారు. ఆధార్, UPIని ఒక ఆసక్తికరమైన రీతిలో కలపడం ద్వారా, వ్యక్తులు తమ గుర్తింపును ఉపయోగించి సులభంగా చెల్లింపులు చేయవచ్చని ఆయన తెలిపారు.
ప్రాక్సీ కంపెనీ గురించి
ప్రాక్సీ టెక్ కంపనీ 2020లో స్థాపించబడింది. $5 మిలియన్లకు పైగా నిధులను సేకరించింది. థంబ్‌పే కంటే ముందు.. ఈ కంపెనీ స్మార్ట్‌హ్యాట్, స్లీఫ్, ఎయిర్‌షిఫ్టర్, మరియు UPI సౌండ్ బాక్స్‌ల వంటి కస్టమైజ్ చేయగల యాక్ససరీస్ ను రూపొందించారు.
Also Read: డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిన యువతి.. కారు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఐఫోన్