Pixel 10 Screen Glitch| గూగుల్ కంపెనీ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్ అనే ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్లు లాంచ్ చేసింది. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన కొందరు యూజర్లు ఫోన్ స్క్రీన్‌లో వింత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు రోజువారీ ఫోన్ వినియోగానికి సమస్య ఉందని కొనుగోలుదారులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మొదటగా ఈ సమస్యల గురించి రిప్టోర్ట్స్ వచ్చాయి. ఆండ్రాయిడ్ అథారిటీ ఒక యూజర్ సమస్యను హైలైట్ చేసింది, అలాగే రెడ్డిట్‌లో వినియోగదారులు ఫ్లాషింగ్ లైన్స్, రాండమ్ డిస్టార్షన్స్ గురించి వివరించారు. Ok-Economist-3997 అనే ఒక రెడ్డిట్ యూజర్, తమ పిక్సెల్ 10లో నిరంతర సమస్యలను ఎదుర్కొన్నట్లు ధృవీకరించాడు. ఈ గ్లిచ్‌ల వల్ల కాల్స్, యాప్‌లు, బ్రౌజింగ్ చేయడం కష్టమవుతోంది. కొన్ని ఫోన్లు ఇంకా ఉపయోగపడుతున్నప్పటికీ, మరికొన్ని దాదాపు వాడలేని స్థితిలో ఉన్నాయి.
సమస్యలకు కారణం
ఈ సమస్యలకు కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఇది హార్డ్‌వేర్ లోపం కావచ్చు లేదా డిస్ప్లే ఇనిషియలైజేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ లోపం కావచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. తప్పుగా ఉన్న డిస్ప్లే డ్రైవర్లు.. ఈ గ్లిచ్‌లకు కారణం కావచ్చు. గూగుల్ ఈ సమస్యను గుర్తించింది కానీ ఇంకా అధికారిక పరిష్కారం విడుదల చేయలేదు. కొందరు వినియోగదారులకు ఈ సమస్య అప్పుడప్పుడు కనిపిస్తుండగా.. మరికొందరికి నిరంతరం ఇబ్బంది కలిగిస్తోంది.
గూగుల్ ఈ సమస్య గురించి ఏం చెప్పిందంటే?
పిక్సెల్ 10 ఎంతో ఆశతో కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఈ సమస్య కారణంగా ఆందోళన చెంది.. రెడ్డిట్‌లో వీడియోలు, ఫిర్యాదులు షేర్ చేస్తున్నారు. గూగుల్ సపోర్ట్ టీమ్ ఈ సమస్యలను సేకరిస్తూ స్పందిస్తోంది. పిక్సెల్ కమ్యూనిటీ ఫోరమ్‌లో వినియోగదారులు తమ సమస్యలను పోస్ట్ చేస్తూ.. త్వరగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. గూగుల్ ఈ విషయాన్ని పరిశీలిస్తూ.. భవిష్యత్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో పరిష్కారం విడుదల చేయవచ్చు.
వినియోగదారులు ఏం చేయాలి?
ఈ సమస్య ఎదురైతే, వెంటనే గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించండి. సమస్య వివరాలను పూర్తిగా నివేదించండి. రెడ్డిట్ పిక్సెల్ కమ్యూనిటీలో మీ అనుభవాలను పంచుకోవడం ద్వారా గూగుల్ సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. అధికారిక ప్రకటనలు, ఫోరమ్‌లను తనిఖీ చేస్తూ తాత్కాలిక పరిష్కారాల కోసం అప్‌డేట్‌గా ఉండండి.
టెన్సర్ G5 చిప్ కూడా ఫెయిల్
స్క్రీన్ సమస్యలతో పాటు, టెన్సర్ G5 చిప్ పనితీరు గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. పిక్సెల్ 10 ప్రో XLలో ఈ కొత్త చిప్ ఉంది. బెంచ్‌మార్క్ టెస్ట్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒక రెడ్డిట్ వినియోగదారుడు.. AnTuTu టెస్ట్‌లో 1,173,221 స్కోర్‌ను రికార్డ్ చేశారు. CPU స్కోరు 415,848, ఇది స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4, డైమెన్సిటీ 9300+తో సమానంగా ఉంది, పిక్సెల్ 9 ప్రో కంటే 15 శాతం మెరుగైనది.
కానీ GPU పనితీరు నిరాశపరిచింది. PowerVR IMG GPU 367,206 స్కోరు సాధించింది. ఇది పిక్సెల్ 9 ప్రో XL కంటే 20 శాతం తక్కువ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 స్థాయిలో ఉంది. దీనివల్ల గేమింగ్ ఆడాలనుకునే సమయంలో ఫోన్ స్లోగా, ల్యాగింగ్ గా ఉంటుంది. దీంతో గేమింగ్ అనుభవం బాగా ప్రభావితమవుతుంది.
కొత్త ఫోన్ అయినప్పటికీ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లో లాంచ్ చేసిన కొన్ని రోజులకే చిప్ స్లోగా ఉండడం, స్క్రీన్ గ్లిచ్ రావడం వంటి సమస్యలు రావడం ఆందోళనకరం.