Kurnool News: సమాజంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కష్టపడటానికి ఇష్టంలేని కొందరు.. తమ తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. తండ్రి చేస్తున్నఉద్యోగంపై కన్నేశాడు కసాయి కొడుకు. పోటీ ప్రపంచంలో తన జీవితా సాఫీగా సాగాలంటే అదొక్కటే మార్గమని భావించాడు. ప్లాన్ ప్రకారం తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన కర్నూలులో వెలుగుచూసింది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తి గ్రామానికి చెందిన రామాచారి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన వయస్సు దాదాపు 58 ఏళ్లు వరకు ఉండవచ్చు. కొన్నాళ్లలో రిటైర్మెంట్ కానున్నాయి. ఆ తర్వాత జీవితం కోసం ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు.
రామాచారి-విరుపాక్షమ్మ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. రామాచారి పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. డిగ్రీ వరకు చదివిన కొడుకు వీరస్వామి ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత ఈ పోటీ ప్రపంచంలో రాణించలేమని భావించాడు. చివరకు తన గ్రామానికి చేరుకుని పని పాటా లేకుండా జులాయిగా మారాడు.
తండ్రి చేస్తున్న బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ కొన్నాళ్లుగా గొడవ పడేవాడు కొడుకు. అయితే బుధవారం తెలవారుజామున ఉద్యోగం విషయంపై మరోసారి తండ్రితో మాట్లాడాడు. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు గొడవ పడ్డారు. పట్టరాని కోపంతో రోకలిబండతో తలపై బలంగా కొట్టి తండ్రిని చంపేశాడు కొడుకు.
ALSO READ: వర్షిణి హత్య కేసులో సంచలన విషయాలు, ప్రియుడితో కలిసి
తండ్రి అరుపులు గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
మద్యం మత్తులో అలా జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఉద్యోగం కోసం తండ్రిని హతమార్చిన ఘటన ఇప్పుడు ఆ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూస్తామోనని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.