Rogbid ZenRing: స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌ల తర్వాత ఇప్పుడు స్మార్ట్ రింగ్స్‌కి కూడా క్రేజ్ బాగా పెరుగుతోంది. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన చాలా స్మార్ట్ రింగ్స్ ప్రధానంగా నిద్ర, హార్ట్ రేట్, స్టెప్స్ వంటి హెల్త్‌కి సంబంధించిన విషయాలను ట్రాక్ చేయడానికే పరిమితమయ్యాయి. అయితే ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్లు లేదా ఇతర అలర్ట్స్ తెలుసుకోవాలంటే మాత్రం మళ్లీ ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌నే చూడాల్సి వచ్చేది.
ఈ సమస్యకు చెక్ పెట్టేలా రోగ్బిడ్ కంపెనీ తాజాగా ‘జెన్‌రింగ్’ (ZenRing) పేరుతో ఓ కొత్త స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం హెల్త్ ట్రాకర్‌లా కాకుండా, వేలికి వైబ్రేషన్ ద్వారా వివిధ రకాల నోటిఫికేషన్లు, అలర్ట్స్‌ను తెలియజేయగలదు. దీంతో ప్రతిసారీ ఫోన్ వైపు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ కొత్త స్మార్ట్ రింగ్ ధర రూ.11,000 వరకు ఉంటుంది.
చూడటానికి ఈ రింగ్ చాలా సింపుల్‌గా, ట్రెండీగా ఉంది. దీని బయటి వైపు మైక్రోక్రిస్టల్ నానో సిరామిక్ కోటింగ్ ఇచ్చారు. లోపలి వైపు 316 స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్ వాడారు. ఇది కేవలం 7.5 మిల్లీమీటర్ల వెడల్పు, 2.5 మిల్లీమీటర్ల మందంతో చాలా తేలికగా ఉంటుంది. కేవలం 5 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో వేలికి పెట్టుకున్నట్టే అనిపించదు. దీనికి 5ATM వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అంటే వర్షంలో తడిచినా, ఈత కొట్టినా, స్నానం చేసినా దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ప్రస్తుతానికి ఇది ‘అబ్సిడియన్ బ్లాక్’ కలర్ ఆప్షన్‌లో సైజు 8 నుంచి 13 వరకు అందుబాటులో ఉంది.
Also Read: 48MP కెమెరా, A19 చిప్ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!
ఈ రింగ్‌లో బోలెడన్ని సెన్సార్లను అమర్చారు. ఇవి మన గుండె చప్పుడు, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ (SpO2), హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV)తో పాటు చర్మం ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. వీటి ద్వారా మన స్లీపింగ్ హ్యాబిట్స్, ఒత్తిడి స్థాయిలు, మహిళలకు సంబంధించిన నెలసరి వివరాలు చాలా కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ డేటా అంతా రోగ్బిడ్ కంపెనీ యాప్‌లో సేవ్ అవుతుంది. అంతేకాదు.. ఈ డేటాను యాపిల్ హెల్త్, గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌లతో కూడా సింక్ చేసుకోవచ్చు. ఒకవేళ హార్ట్ రేట్ అబ్‌నార్మల్‌గా మారినా లేదా ఆక్సిజన్ పడిపోయినా ఈ రింగ్ వెంటనే మనల్ని అలర్ట్ చేస్తుంది.
ఇప్పటివరకు వచ్చిన రింగ్స్ మాదిరి కాకుండా.. దీనిలో చిన్న వైబ్రేషన్ మోటార్ ఇచ్చారు. తద్వారా ఫోన్‌కి కాల్స్, వాట్సప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు వచ్చినప్పుడు వేలిపైనే చిన్న వైబ్రేషన్ ద్వారా తెలిసిపోతుంది. దీనిలో టచ్, గెస్చర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. రింగ్‌ని వేలితో తట్టడం లేదా స్వైప్ చేయడం ద్వారా సాంగ్స్ మార్చుకోవచ్చు, షార్ట్ వీడియోస్ స్క్రోల్ చేయవచ్చు. అంతేకాదు.. ఫోన్ కెమెరా షట్టర్‌ని కూడా దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో మన చేతిని పైకి కిందకి పది సార్లు ఊపితే.. ఇది ఆటోమేటిక్‌గా మనం ముందే సెట్ చేసిన ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేస్తుంది.
ఈ చిన్న రింగ్‌లో 20mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో 4 నుంచి 6 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కంపెనీ ప్రత్యేకంగా 400mAh కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ కేస్‌ను ఇస్తోంది. దీనితో ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. రోగ్బిడ్ కంపెనీ కేవలం ఈ రింగ్ మాత్రమే కాకుండా.. పూర్తి ఆండ్రాయిడ్ సపోర్ట్, పాప్‌అప్ కెమెరాతో ‘మోడల్ R3T’ స్మార్ట్‌వాచ్‌ని, అలాగే ఏఐ సపోర్ట్ ఉన్న ‘విజన్ డబ్ల్యూ’ స్మార్ట్ గ్లాసెస్‌ని కూడా తాజాగా లాంచ్ చేసింది.
Also Read: భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!