Sanchar Saathi Portal: మన ఫోన్‌కి రోజుకో రకం స్ప్యామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి. కేవైసీ అప్‌డేట్ అనో, లేదా పార్సిల్ వచ్చిందనో చెప్పి అకౌంట్లు ఖాళీ చేసే ముఠాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర టెలికాం శాఖ తీసుకొచ్చిన సంచార్ సాథీ పోర్టల్ ఇప్పుడు ప్రజలకు పెద్ద రక్షణ కవచంలా మారింది. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే ఈ పోర్టల్ ఏకంగా 30 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. అసలు ఈ పోర్టల్‌ను జనాలు దేని కోసం వాడుతున్నారు, దీని వల్ల మనకేంటి ఉపయోగం వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంచార్ సాథీ వచ్చినప్పటి నుంచి సైబర్ నేరగాళ్ల ఆటలకు బాగానే బ్రేకులు పడ్డాయి. పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు సుమారు రూ.5,000 కోట్లకు పైగా మోసాలను అధికారులు అడ్డుకోలిగారు. అంతేకాకుండా.. మోసాలకు పాల్పడుతున్న దాదాపు 50 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లను వెంటనే తొలగించారు. మనకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఈ పోర్టల్ ద్వారా రిపోర్ట్ చేస్తే.. అధికారులు వెంటనే యాక్షన్ తీసుకుంటారు.
Also Read: డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ఈ పోర్టల్ ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. ఇప్పటివరకు 60 లక్షలకు పైగా పోయిన ఫోన్లను ఈ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశారు. అందులో దాదాపు 14 లక్షల ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అందజేశారు. మీ ఫోన్ పోయిన వెంటనే ఇందులో ఐఎంఈఐ నంబర్ నమోదు చేస్తే.. ఏ నెట్‌వర్క్ వాడినా ఆ ఫోన్ పనిచేయకుండాపోతుంది. అలాగే పోలీసుల సహాయంతో దానిని చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు.
ఈ పోర్టల్‌లో మన పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంది. మనకు తెలియకుండా ఉన్న నంబర్లను వెంటనే రిపోర్ట్ చేయవచ్చు. అలాగే Chakshu అనే ఫీచర్ ద్వారా ఫేక్ ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫర్ల పేరిట వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు. కొత్త లేదా పాత ఫోన్ కొనేముందు అది అసలైందో కాదో కూడా వెరిఫై చేసుకోవచ్చు.
ప్రస్తుతం సంచార్ సాథీ యాప్ తెలుగుతో సహా 21 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 2.8 కోట్లకు పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మనం ఇచ్చే చిన్న సమాచారం కూడా మరికొందరు మోసపోకుండా కాపాడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏమైనా డబ్బులు పోగొట్టుకుని ఉంటే.. వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Also Read: చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?