Wi Fi Speed Tips | వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు మరియు స్మార్ట్ హోమ్ వినియోగదారులకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. అయితే.. కనెక్షన్ తీసుకున్నాక కాలం గడిచేకొద్దీ వై ఫై స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్లలో అసహనం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, కొన్ని సులభమైన ట్రిక్స్, జాగ్రత్తలు అనుసరించడం ద్వారా మీ Wi-Fi స్పీడ్‌ను మెరుగుపరచవచ్చు.
స్పీడ్ టెస్ట్ చేయండి
మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిందనిపిస్తే, మొదటగా స్పీడ్ టెస్ట్ చేయండి. Speedtest.net లేదా Fast.com వంటి వెబ్‌సైట్లను ఉపయోగించి మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను తనిఖీ చేయండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏవైనా మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారో లేదో కూడా తనిఖీ చేయండి.
రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచండి
Wi-Fi రూటర్ ఓవర్‌హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రూటర్‌ను ఎండ తగలని లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచాలి. రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా ఉంటుంది మరియు స్పీడ్ మెరుగుపడుతుంది.
రూటర్‌ను సరైన ప్రాంతంలో ఉంచండి
రూటర్‌ను ఇంటి మధ్యలో ఉంచడం వల్ల నలు మూలలకు సిగ్నల్ సరిగా అందుతుంది. ఎత్తైన ప్రదేశంలో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా రూటర్‌ను ఉంచడం మంచిది. రూటర్‌లో యాంటినాలు ఉంటే.. సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతానికి వాటిని తిప్పండి.
రూటర్‌ను రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేయండి
Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు, రోజుకు ఒకసారి రూటర్‌ను స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది మరియు స్పీడ్ మెరుగుపడుతుం ది.
Also Read: సమ్మర్ వచ్చేస్తోంది.. కూలర్ కొంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి
అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించండి
మీ ఇంటిలోని కొన్ని ఉపకరణాలను ఉపయోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లెక్ట్ లేదా రీడైరెక్ట్ చేయవచ్చు. ఇందుకోసం రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఇలా చేయడం వల్ల Wi-Fi సిగ్నల్ మెరుగుపడుతుంది. ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించి, రూటర్ వెనుక భాగంలో ఉంచాలి. అయితే ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ కూడా టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi సిగ్నల్‌లో అవాంతరాలను తగ్గిస్తుంది.
5GHz బ్యాండ్‌ను ఉపయోగించండి
మీ రూటర్ డ్యూయల్-బ్యాండ్ సపోర్ట్ చేస్తుందో లేదో తనిఖీ చేయండి. కొత్త డివైసెస్ 5GHz బ్యాండ్‌ను సపోర్ట్ చేస్తాయి, ఇది తక్కువ రేంజ్‌లో ఎక్కువ స్పీడ్‌ను అందిస్తుంది. Wi-Fi నెట్‌వర్క్ లిస్ట్‌లో 5GHz కనెక్షన్ ఉంటే దాన్ని ఎంచుకోండి.
కనెక్టెడ్ డివైసెస్‌ను తనిఖీ చేయండి
ఫ్రిడ్జ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు వంటి పరికరాలు Wi-Fi సిగ్నల్‌ను దెబ్బతీస్తాయి. ఈ పరికరాలకు దూరంగా రూటర్‌ను ఉంచండి. అలాగే, పొరుగు ఇంటి Wi-Fi నెట్‌వర్క్ కూడా స్పీడ్‌ను ప్రభావితం చేయవచ్చు.
ఛానెల్‌ను మార్చండి
రూటర్ 2.4GHz లేదా 5GHz బ్యాండ్స్‌లో పనిచేస్తుంది. ఈ బ్యాండ్స్‌లో అనేక ఛానెల్స్ ఉంటాయి. తక్కువ ట్రాఫిక్ ఉన్న ఛానెల్‌ను ఎంచుకోవడం ద్వారా స్పీడ్‌ను మెరుగుపరచవచ్చు. WiFiInfoView (Windows) లేదా Wi-Fi Analyzer (Android/iOS) వంటి యాప్స్‌ను ఉపయోగించి ఛానెల్ వినియోగాన్ని తనిఖీ చేయండి.
రూటర్‌ను అప్‌గ్రేడ్ చేయండి
పాత రూటర్ కనెక్టివిటీ సమస్యలకు కారణం కావచ్చు. మీరు ఇంట్లో ఎక్కువ డివైసెస్‌లను ఉపయోగిస్తే, మెరుగైన స్టాండ్‌అలోన్ రూటర్‌ను కొనుగోలు చేయండి. కొత్త రూటర్‌కు మారిన తర్వాత, ISP రూటర్‌లోని Wi-Fiని ఆఫ్ చేయండి.
QoS సెట్టింగ్స్‌ను మార్చండి
మీ రూటర్‌లో Quality of Service (QoS) సెట్టింగ్స్‌ను చెక్ చేయండి. ఈ సెట్టింగ్స్ ద్వారా మీరు ఉపయోగిస్తున్న అప్లికేషన్‌లకు ప్రాధాన్యతను ఇవ్వవచ్చు. ఇది గేమింగ్ మరియు స్ట్రీమింగ్‌కు ఉపయోగపడుతుంది.
రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా రెండో రూటర్‌ను ఉపయోగించండి
మీ ఇల్లు పెద్దగా ఉంటే, రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా సెకండరీ రూటర్‌ను ఉపయోగించండి. ఇది ఇంటి అన్ని మూలలకు సిగ్నల్‌ను అందించడంలో సహాయపడుతుంది.
హై-స్పీడ్ ప్లాన్‌ను పరిశీలించండి
ఇంట్లో ఎక్కువ మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ఎక్కువ Mbps కలిగిన ప్లాన్‌ను తీసుకోవడం మంచిది. అయితే మీ రూటర్ ఆ వేగాన్ని హ్యాండిల్ చేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి.
ఈ టిప్స్‌ను అనుసరించడం ద్వారా మీ Wi-Fi స్పీడ్‌ను గణనీయంగా మెరుగుపరచవచ్చు, మెరుగైన ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు.