Bulletproof Bags: పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా టర్కీకి చెందిన ఒక ప్రముఖ డిఫెన్స్ సంస్థ వినూత్న బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల్లో లేదా బయట అనుకోకుండా జరిగే తుపాకీ కాల్పులు, సాయుధ దాడుల సమయంలో పిల్లలకు అదనపు రక్షణ కల్పించేందుకు ఈ బుల్లెట్ ప్రూఫ్ స్కూల్ బ్యాగులను రూపకల్పన చేశారు. ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ బ్యాగులు.. ప్రస్తుతం అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
టర్కీ రాజధాని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న ఈ రక్షణ రంగ సంస్థ తయారుచేసిన బ్యాగులు చూడటానికి సాధారణ బ్యాగుల లాగానే కనిపిస్తున్నాయి. ఇతర వాటితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసమేమి లేదు. ఈ ప్రత్యేక బ్యాగుల్లో అమర్చిన రక్షణ పొరలు అత్యంత తేలికగా ఉంటూ.. ఇతరవాటితో పోలిస్తే కేవలం 300 గ్రాముల అదనపు బరువునే బ్యాగుకు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి 9mm పిస్టల్ కాల్పులతో పాటు తీవ్రత ఎక్కువగా ఉండే 5.56mm రైఫిల్ బుల్లెట్లను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని తయారీ దారులు చెబుతున్నారు. ఆపద సమయంలో విద్యార్థులు ఈ బ్యాగును అత్యవసర కవచంలా (Shield) వాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
Ankara’da okul saldırılarına karşı öğrenciler için kurşun geçirmez çanta geliştirildi.
“Çanta, .357 Magnum, 5.56, 9 mm ve .44 Magnum mermilerine karşı koruyucu.” https://t.co/BDMI2VlmBS
— Metropol Haber (@metropolmedya_) October 4, 2026
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్కూళ్లపై దాడి ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ఏంటన్న ప్రశ్నలు రోజురోజుకు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్స్ వాడకం అత్యంత ఆవశ్యకమని నిపుణులు పేర్కొంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఈ బ్యాగులు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడుతున్నారు.
Also Read: భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?
బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు పిల్లల రక్షణకు ఉద్దేశించినవే అయిన్పపటికీ.. ఈ తరహా ఆవిష్కరణలు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు భుజాన బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు మోయాల్సిన పరిస్థితులు రావడం సమాజంలో భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంకేతిక రక్షణ తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ దాడులకు మూలకారణమైన సమస్యలను పరిష్కరించి పాఠశాలలను సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడమే అసలైన పరిష్కారమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు