Cyber Crime : సైబర్ క్రైమ్స్.. ఈ మాట వింటేనే ప్రతీ ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. నమ్మిన వాళ్లని ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారిలో ఏ వర్గం మినహాయింపు కాకపోయినప్పటికీ.. ముఖ్యంగా ఉద్యోగం లేని నిరుద్యోగులే మొదటి జాబితాలో ఉన్నారని తాజా అధ్యయనంలో బయటపడింది.
నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా పడుతున్నారని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరుగుతున్న మోసాల్లో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకుంటున్నారని.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల తెలియని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారని.. మానవ వనరుల సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడించింది.
⦿ ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలని.. జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అయితే అనుకున్న స్థాయిలో జీవితంలో రాణించలేని వారి మనస్తత్వంతో సైబర్ నేరగాళ్లు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నియామక సంస్థలమని చెబుతూ చేస్తున్న మోసాల్లో 75% మంది ఉద్యోగులే ఉన్నారని తెలుస్తోంది.
⦿ ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వంతో పాటు సైబర్ పోలీసులు చేపడుతున్న చర్యలు సరిపోతాయని 28% మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 55 శాతం మంది ఈ అభిప్రాయాన్ని విభేదిస్తూ మోసాల నియంత్రణకు కఠిన చర్యలు రావాలని తెలిపారు. ఎన్ని విధాల సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయని… ఇంకా సైబర్ సెక్యూరిటీ పైన సాధారణ ప్రజలకు అవగాహన రావాలని చెప్పుకొచ్చారు.
⦿ ఉన్నత స్థాయి చదువులు చదివిన వారు సైతం ఉనికిలో లేని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి అనుభవం దాదాపు 70 శాతం మంది ఉన్నతస్థాయి వ్యక్తులే ఎదుర్కొన్నట్టు చెప్పుకు వచ్చింది. ఉద్యోగం కావాలని ఆకాంక్షించే వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలని నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
⦿ ఉద్యోగం పేరుతో డబ్బులు దండుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలతో పాటు క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలు సైతం కోరగా మూడు శాతం మంది అమాయకంగా మోసపోతున్నారని వ్యక్తిగత సమాచారాన్ని వారికి అందిస్తున్నారని తేలింది ఈ సర్వే.
⦿ ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నేరగాళ్లు నమ్మిస్తున్నారని.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలని ప్రయత్నించి మోసపోతున్నవారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. తర్వాత స్థానాల్లో రిటైల్, ఈ కామర్స్, ఫైనాన్స్, హెల్త్ రంగాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఆన్లైన్ ఉద్యోగ నియామకాలు ఎక్కువ అవ్వటం వలన మోసాలు జరిగే అవకాశాలు సైతం పెరిగాయని తెలిపిన ఈ సర్వే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పుకు వచ్చింది.
⦿ ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని.. .ఆన్ లైన్ మోసాల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సర్వే నిరుద్యోగులను హెచ్చరించింది. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రతీ విషయాన్ని పసిగడుతున్నారనే విషయాన్ని గుర్తించాలని జీనియస్ కన్సల్టెంట్ తెలిపింది.
ALSO READ : పబ్లిక్ ఏరియాలో WiFi వాడుతున్నారా? మీ సీక్రెట్స్ అన్నీ?