Smartphone updates Issue: చాలామంది ఫోన్ కొని నాలుగేళ్లు, అయిదేళ్లు దాటినా వాటిని ఉపయోగిస్తుంటారు. ఆ ఫోన్లపై ఒక్క గీత కూడా పడలేదు. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్లేదు. ఇంకో ఏడాది లాగించేస్తే ఏదో ఆఫర్‌లో కొత్త ఫోన్ కొనుక్కోవచ్చనే ధోరణిలో ఉంటారు. వేల రూపాయలు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన చాలామంది యూజర్ల ఇదే అభిప్రాయంతో ఉంటారు. కానీ, స్మార్ట్‌ఫోన్‌ను కేవలం వాడటానికి మాత్రమే కాకుండా, దాని పనితీరు, భద్రత గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా అప్‌డేట్స్ పట్ల నిర్లక్ష్యం చేస్తే, మీకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవాలి. అలాగే ఫోన్ తరచుగా మార్చే ఉద్దేశం లేనివారికి ఈ కథనం ఉపయోగపడుతుంది.
స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్ రెండు రకాలు. ఒకటి ఓఎస్ అప్‌డేట్స్, రెండు సెక్యూరిటీ అప్‌డేట్స్.
ఆండ్రాయిడ్ (O.S.) అప్‌డేట్స్: గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ప్రతి సంవత్సరం కొత్త వెర్షన్లు విడుదల చేస్తూ ఉంటుంది. ఈ అప్‌డేట్స్ స్మార్ట్‌ఫోన్‌కు .. కొత్త ఫీచర్లు, ఇంటర్‌ఫేస్ మార్పులు, మెరుగైన పనితీరు అందిస్తాయి. ప్రస్తుతం చాలా ఫోన్లు ఆండ్రాయిడ్ 14పై నడుస్తుండగా, ఆండ్రాయిడ్ 15 కూడా విడుదల అయింది.
సెక్యూరిటీ అప్‌డేట్స్:
గూగుల్ నెలవారీగా సెక్యూరిటీ అప్‌డేట్లు విడుదల చేస్తుంది. ఈ అప్‌డేట్స్ ఫోన్ భద్రతను పెంచి సైబర్ ముప్పులనుంచి రక్షిస్తాయి.
ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఆగిపోతే సమస్యలేమిటి?
కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండవు. అప్‌డేట్లు ఆగిపోతే ఆండ్రాయిడ్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లను మీరు మిస్ అవుతారు.
యాప్ సపోర్ట్ నిలిచిపోవచ్చు
కొంతకాలానికి డెవలపర్లు పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్ట్ నిలిపివేస్తారు. ఉదాహరణకు: వాట్సాప్, ఎస్‌బీఐ వంటి సంస్థలు పాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
కొత్త ఫోన్ అవసరం
ఓఎస్ అప్‌డేట్లు ఆగిపోవడం వల్ల కొన్నాళ్లకు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం ఉంటుంది.
సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆగిపోతే చాలా నష్టం?
సైబర్ ముప్పులు: సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకుంటే.. డేటా చౌర్యం, హ్యాకింగ్ వంటి ప్రమాదాలు ఎక్కువ అవుతాయి.
ఆర్థిక మోసాలు:
సెక్యూరిటీ అప్‌డేట్లు లేకుంటే.. సైబర్ మోసగాళ్లు ఆర్థిక నేరాల కోసం స్మార్ట్ ఫోన్లను సునాయసంగా టార్గెట్ చేయడం జరుగుతోందని చాలా కేసుల్లో నిరూపితమైంది.
డేటా చౌర్యం
కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకుంటే.. ఫోన్ ద్వారా మీ డేటాను సైబర్ నేరగాళ్లు సులభంగా దోచుకునేందుకు అవకాశముంటుంది.
అందుకే స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి.
లాంగ్-టర్మ్ యూజర్ల కోసం:
నాలుగైదు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదారేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు హామీ ఇస్తున్న ఫోన్లను ఎంచుకోండి. పిక్సెల్, శాంసంగ్, యాపిల్ వంటి కంపెనీలు దీర్ఘకాలం అప్‌డేట్లు అందిస్తాయి.
ఆఫర్ ఫోన్లకు జాగ్రత్త:
ఆఫర్‌లో తక్కువ ధరకు పాత ఫోన్లు కొనుగోలు చేస్తే, తగిన అప్‌డేట్లు అందుబాటులో ఉండవు.
మన్నికగల బ్రాండ్ ఎంపిక:
దీర్ఘకాలం ఫోన్‌ను సాఫీగా ఉపయోగించాలంటే నమ్మదగిన బ్రాండ్‌ను ఎంచుకోవాలి.
స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం భద్రత, పనితీరు పరంగా చాలా కీలకం. ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించాలనుకునే వారు కొనుగోలు సమయంలో ఫోన్‌కు అప్‌డేట్స్ హామీ ఇచ్చే వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం.