UPI Safety Tips: దేశంలో డబ్బులు చెల్లించే విధానాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పూర్తిగా మార్చేసింది. జేబులో రూపాయి లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్ ద్వారా వేలాది రూపాయాల లావాదేవీలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే ఈ సౌకర్యంతో పాటు కొన్ని రిస్కులు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. యూపీఐ వాడుతున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 5 సురక్షితమైన పద్దతులను సూచిస్తున్నారు. అవేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో చూద్దాం.
చాలా మంది సైబర్ కేటుగాళ్లు.. క్యూఆర్ కోడ్ ను అడ్డుపెట్టుకొని మోసాలకు తెగబడుతున్నారు. లాటరీ తగిలిందని, డబ్బు కావాలంటే క్యూ కోడ్ స్కాన్ చేయాలని నమ్మిస్తుంటారు. అయితే క్యూఆర్ కోడ్ అనేది.. కేవలం డబ్బు పంపడానికి మాత్రమే ఉద్దేశించిందని నిపుణులు అంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బు ఖాతాలో జమ కావడం జరగదని స్పష్టం చేస్తున్నారు.
ఏటీఎం పిన్ నంబర్ విషయంలో గోప్యత పాటించే చాలా మంది.. యూపీఐ పిన్ దగ్గరకు వచ్చేసరికి.. కాస్త నిర్లక్ష్యం వహిస్తుంటారు. యూపీఐ పిన్ కూడా సరిగ్గా ఏటీఎం లాండిదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మాత్రమే ఈ పిన్ ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు. కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ ఫోన్ చేసి.. యూపీఐ పిన్ నెంబర్ అడిగితే అస్సలు షేర్ చేయవద్దని హితవు పలుకుతున్నారు. వారు కచ్చితంగా మోసగాళ్లు అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా యూపీఐ యాప్స్‌లో ‘కలెక్ట్ రిక్వెస్ట్’ (Collect Request) అనే ఫీచర్ ఉంటుంది. డబ్బులు అడిగేందుకు ఇది సాయపడుతుంది. అయితే కొందరు మోసగాళ్లు.. దీనిని అడ్డుపెట్టుకొని చీటింగ్ కు పాల్పడుతున్నారు. క్యాష్‌బ్యాక్ వచ్చిందనో లేదా రివార్డ్ పాయింట్లు వచ్చాయనో ఆశ చూపిస్తూ.. కలెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు. ఈ క్రమంలో సరిగ్గా గమనించకుండా దాన్ని నొక్కి పిన్ నంబర్ ఎంటర్ చేస్తే.. అకౌంట్ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి యాప్ స్క్రీన్‌పై ఏదైనా అపరిచిత నోటిఫికేషన్ వస్తే ఆ రిక్వెస్ట్‌ను వెంటనే ‘డిక్లైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంగారులోనో లేదా నంబర్ తప్పుగా కొట్టడం వల్లనో ఒక్కోసారి వేరే వాళ్ల ఖాతాలోకి డబ్బులు వెళ్ళిపోతుంటాయి. అలా జరిగినప్పుడు వెంటనే భయపడకుండా.. మీరు వాడిన యూపీఐ యాప్ (GPay, PhonePe, Paytm) కస్టమర్ సపోర్ట్‌కు ఫిర్యాదు చేయాలి. దాంతో పాటు బ్యాంకును సంప్రదించి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన NPCI పోర్టల్‌లో ఆ లావాదేవీకి సంబంధించిన వివరాలతో ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
Also Read: టీవీ సౌండ్ నచ్చట్లేదా? రూ.5 వేలలో క్రేజీ సౌండ్‌బార్లు.. ఇంటిని థియేటర్‌లా మార్చేయండి!
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు చాలా మంది కంగారుపడి గూగుల్‌లో ‘కస్టమర్ కేర్ నంబర్’ కోసం వెతుకుతుంటారు. గూగుల్‌లో కనిపించే నంబర్లలో చాలా వరకు సైబర్ నేరగాళ్లు సృష్టించిన నకిలీ నంబర్లు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటికి ఫోన్ చేస్తే వారు బ్యాంక్ అధికారులలా మాట్లాడి.. అకౌంట్ వివరాలు లాగేస్తారని సూచిస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ యూపీఐ యాప్ లోపల ఉండే అధికారిక ‘హెల్ప్’ లేదా ‘సపోర్ట్’ సెక్షన్‌ను మాత్రమే వినియోగించాలని హితవు పలుకుతున్నారు.
Also Read: మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?