WhatsApp New Features: మన ఫోన్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీస్ అంటూ పదుల సంఖ్యలో వాట్సప్ గ్రూపులు ఉంటాయి. వాటిలో రోజూ వచ్చే వందలాది మెసేజ్‌ల మధ్య.. మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారం ఎక్కడో కలిసిపోతుంటుంది. దీనికి తోడు, కొత్తగా గ్రూపులో చేరిన వాళ్లకు అంతకుముందు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న ఇబ్బందులకు చెక్ పెడుతూ.. మెటా ఇప్పుడు 4 అదిరిపోయే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముఖ్యమైన మెసేజ్‌లను శాశ్వతంగా పిన్ చేసుకోవడం నుంచి, మనల్ని ట్యాగ్ చేసిన మెసేజ్‌లను క్షణాల్లో వెతకడం వరకు ఈ అప్‌డేట్స్ మన చాటింగ్‌ను చాలా సులభం చేయనున్నాయి. ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
గ్రూప్‌లో అందరికీ ఉపయోగపడే అడ్రస్, ఈవెంట్ వివరాలు లేదా ముఖ్యమైన రూల్స్ ఉంటే వాటిని పైన పిన్ చేసి పెట్టుకోవడం మనకు అలవాటే. అయితే ఇప్పటివరకు పిన్ చేసిన మెసేజ్ కేవలం 24 గంటలు, 7 రోజులు లేదా గరిష్టంగా 30 రోజులు మాత్రమే పైన కనిపించేది. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో, ముఖ్యమైన మెసేజ్‌లను ఇక శాశ్వతంగా పిన్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల పాత చాట్స్‌లో వెతుక్కునే శ్రమ తప్పుతుంది, గ్రూప్ సభ్యులందరికీ ఆ సమాచారం ఎప్పుడూ కళ్లముందే ఉంటుంది.
గ్రూపులో ఎవరైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు, అంతకుముందు ఏం చర్చ జరిగిందో తెలియక కాస్త అయోమయంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ గ్రూప్ అడ్మిన్లకు ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. కొత్త మెంబర్ జాయిన్ అయిన తర్వాత కూడా, వాళ్ల పేరుపై క్లిక్ చేసి ఇటీవల జరిగిన మెసేజ్‌లను షేర్ చేయవచ్చు. ఇవి కూడా పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. దీనివల్ల కొత్తగా వచ్చిన వాళ్లు కూడా గ్రూప్ చర్చను మొదటి నుంచే సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Also Read: రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!
పెద్ద గ్రూపుల్లో రోజూ వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి. అందులో మిమ్మల్ని ఎవరైనా ట్యాగ్ చేసి ముఖ్యమైన విషయం అడిగితే వెతకడం చాలా కష్టం. ఈ తలనొప్పిని తగ్గించడానికి వాట్సప్ కొత్త మెన్షన్ ఫిల్టర్ తెచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే, కేవలం మిమ్మల్ని ట్యాగ్ చేసిన మెసేజ్‌లు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తాయి. ప్రతి మెసేజ్‌ను విడివిడిగా చదవాల్సిన పని లేకుండా, ముఖ్యమైన పనులను మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు.
ఇకపై కేవలం గ్రూప్ సభ్యులకు మాత్రమే కనిపించేలా ఫొటోలు, వీడియోలతో స్టేటస్ పెట్టుకోవచ్చు. మామూలు స్టేటస్ లాగే ఇది కూడా 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. గ్రూపులోని మిగతా వాళ్లు దీనికి రియాక్ట్ అవ్వడంతో పాటు, వాళ్లు కూడా తమ స్టేటస్‌లను షేర్ చేసుకోవచ్చు. పర్సనల్ కాంటాక్ట్స్ అందరికీ కాకుండా.. కేవలం ఒక గ్రూప్‌తో మాత్రమే అప్‌డేట్స్ పంచుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ నాలుగు కొత్త ఫీచర్లు దశలవారీగా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి.
Also Read: చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!