WhatsApp Ads| ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్.. సోమవారం జూన్ 17, 2025న ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై యాప్‌లోని కొన్ని విభాగాల్లో ప్రకటనలు కనిపిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం వాట్సాప్ మాతృ సంస్థ మెటా తమ బిలియన్ల మంది వినియోగదారుల నుండి ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో వచ్చింది. ఈ ప్రకటనలు కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి, ఇది రోజూ దాదాపు 1.5 బిలియన్ మంది ఉపయోగిస్తారు. వ్యక్తిగత చాట్‌లు, కాల్స్ లేదా స్టేటస్‌లలో ప్రకటనలు ఉండవని వాట్సాప్ హామీ ఇచ్చింది. వ్యక్తిగత సందేశాలు, కాల్స్, స్టేటస్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడతాయని, వాటిని ప్రకటనల కోసం ఉపయోగించబోమని వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టం చేసింది.
వాట్సాప్‌లో ప్రకటనల మార్పు
వాట్సాప్‌ను 2009లో జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ స్థాపించారు. వారు యాప్‌లో ప్రకటనలు లేకుండా నడపాలని హామీ ఇచ్చారు. కానీ, 2014లో ఫేస్‌బుక్ (ఇప్పుడు మెటా) వాట్సాప్‌ను కొనుగోలు చేసిన తర్వాత, స్థాపకులిద్దరూ కొన్ని సంవత్సరాలకు సంస్థను విడిచారు. ఇప్పుడు మెటా వాట్సాప్ నుండి ఆదాయం పొందే మార్గాలను చూస్తోంది. ఈ కొత్త ప్రకటనల స్ట్రాటెజీ అందులో ఒక భాగం.
ప్రకటనల కోసం డేటా ఉపయోగం
వాట్సాప్ యూజర్ల వయస్సు, భౌగోళిక స్థానం, భాషా ప్రాధాన్యతలు, వారు అనుసరించే ఛానెల్స్ ను బట్టి వారి పరస్పర చర్యల ఆధారంగా యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. అయితే.. వ్యక్తిగత సందేశాలు, కాల్స్, లేదా గ్రూప్ సభ్యత్వాలను ప్రకటనల కోసం ఉపయోగించబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇది వినియోగదారుల గోప్యతను కాపాడే ప్రయత్నంగా చూడవచ్చు.
కొత్త ఆదాయ మార్గాలు
ప్రకటనలతో పాటు.. వాట్సాప్ మరో రెండు ఆదాయ మార్గాలను ప్రవేశపెట్టింది. మొదటిది, ఛానెల్స్ నడిపే వారు తమ అప్‌డేట్స్ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయవచ్చు. రెండవది, వ్యాపార యజమానులు తమ ఛానెల్‌ను ఎక్కువ మంది చూసేలా ప్రమోట్ చేయడానికి చెల్లింపు చేయవచ్చు, దీనివల్ల కొత్త ఫాలోవర్లను ఆకర్షించవచ్చు. ఈ రెండు ఫీచర్లు వాట్సాప్‌కు ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి.
మెటా కంపెనీకి ఆదాయం ఎక్కువగా ప్రకటనల నుండే వస్తుంది. 2025లో మెటా మొత్తం ఆదాయం 164.5 బిలియన్ డాలర్లు, అందులో 160.6 బిలియన్ డాలర్లు ప్రకటనల నుండి వచ్చాయి. ప్రకటనలు మెటాకు ఎంత ముఖ్యమో ఈ సంఖ్యలు చూపిస్తున్నాయి.
స్టేటస్ అప్‌డేట్స్‌లో కొత్త ఫీచర్లు
వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. మ్యూజిక్ స్టిక్కర్లు, ఇంటరాక్టివ్ టూల్స్, లేఅవుట్ కొలాజ్‌లతో స్టేటస్‌లు సాధారణ ఫోటోలు లేదా టెక్స్ట్ పోస్టుల కంటే ఎక్కువ ఆసక్తికరంగా మారాయి. ఈ మార్పులు యూజర్లు తమ అనుభవాలను మరింత ప్ర్యతేకంగా తెలియజేసేలా సౌకర్యం కల్పిస్తాయి. స్టేటస్ విభాగం ఇప్పుడు కేవలం తాత్కాలిక పోస్టుల కంటే ఎక్కువగా, ఒక వైవిధ్యమైన కథల వేదికగా మారింది.
Also Read: ఈ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక
వాట్సాప్‌లో ప్రకటనలు ప్రవేశపెట్టడం ఒక పెద్ద మార్పు. ఇది యూజర్ల అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ప్రైవెసీని కాపాడుతూనే, ఆదాయాన్ని పెంచే ఈ కొత్త విధానం వాట్సాప్‌ను మరింత బలోపేతం చేయవచ్చు. అయితే, వినియోగదారులు ఈ ప్రకటనలను ఎలా స్వీకరిస్తారు అనేది తెలియాలంటే మరి కొన్ని రోజుల తరువాతే తెలుస్తుంది.