Wired vs Wireless Charging: సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటిని ఛార్జ్ చేసే విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? ఏ విధానంలో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది? బ్యాటరీ లైఫ్‌పై దేని ప్రభావం ఎక్కువ? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రస్తుతం రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది కేబుల్ ద్వారా నేరుగా కరెంట్ అందించే వైర్డ్ ఛార్జింగ్. రెండోది ఎలాంటి వైర్లు లేకుండా ప్యాడ్‌పై ఫోన్ పెట్టి ఛార్జ్ చేసే వైర్‌లెస్ విధానం. ఇందులో ఛార్జింగ్ ప్యాడ్ లోపల ఉండే కాయిల్ అయస్కాంత శక్తిని సృష్టిస్తుంది. ఫోన్‌లోని మరో కాయిల్ ఆ శక్తిని గ్రహించి బ్యాటరీకి కావాల్సిన విద్యుత్‌గా మారుస్తుంది. ఈ టెక్నాలజీ Qi ప్రమాణంతో పనిచేస్తుంది. అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉండదు కాబట్టి.. ఫోన్ కొనేముందే ఈ సపోర్ట్ ఉందో లేదో గమనించాలి.
ఛార్జింగ్ వేగంలో వైర్డ్ విధానమే ఎప్పుడూ ముందుంటుంది. సరైన అడాప్టర్, కేబుల్ ఉపయోగిస్తే అధిక వాట్లతో ఫోన్ బ్యాటరీని చాలా తక్కువ సమయంలో నింపవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ అనేది మనం వాడే ప్యాడ్ సామర్థ్యం, ఫోన్ సపోర్ట్, ప్యాడ్‌పై ఫోన్ అమరికపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల వచ్చిన Qi2, 2025లో విడుదలైన Qi2 25W టెక్నాలజీలు అయస్కాంతాల సాయంతో వేగాన్ని మెరుగుపరిచాయి. అయినప్పటికీ.. అన్ని ఫోన్లు ఆ స్థాయి వేగాన్ని అందుకోలేవు. కేవలం వాట్ల సంఖ్య మాత్రమే ఇక్కడ ప్రధానం కాదు.
Also Read: ఫ్రీ Wi-Fi వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? కనెక్ట్ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
వైర్‌లెస్ ఛార్జింగ్ సమయంలో కొంత విద్యుత్ వేడిగా మారడం వల్ల ఫోన్, ప్యాడ్ కొద్దిగా వేడెక్కుతాయి. ఈ అధిక ఉష్ణోగ్రత దీర్ఘకాలంలో బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. వేడి పెరిగినప్పుడు కొన్ని ఫోన్లు భద్రత కోసం ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తాయి. అలాగే మందపాటి లేదా మెటల్ కవర్లు ఉంటే ఛార్జింగ్‌కు అడ్డంకిగా మారుతాయి. వైర్డ్ ఛార్జింగ్‌లోనూ వేడి వస్తుంది కాబట్టి.. రెండు పద్ధతుల్లోనూ నాణ్యమైన ఛార్జర్లనే వాడాలి.
ఆఫీసు డెస్క్ వద్ద ఉన్నప్పుడు లేదా రాత్రి పడుకునేటప్పుడు వైర్‌లెస్ ఛార్జింగ్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కేబుల్ పెట్టే పని ఉండదు. కానీ ప్రయాణాల్లో, త్వరగా ఛార్జింగ్ అవ్వాలంటే వైర్డ్ ఛార్జింగే ఉత్తమం. వైర్‌లెస్ ప్యాడ్ కొనేటప్పుడు Qi సర్టిఫికేషన్, సరైన వాటేజ్ పరిశీలించాలి. మొత్తానికి వేగం ముఖ్యమైతే వైర్డ్ ఛార్జింగ్, సౌకర్యం ముఖ్యమైతే వైర్‌లెస్ ఛార్జింగ్ ఎంచుకోవడం మంచిది.
Also Read: మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!