
Allen Donald : టైమ్డ్ అవుట్ వ్యవహారం ముగిసిపోయినా ఆ మంట చల్లారడం లేదు. అది బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ అలెన్ డోనాల్డ్ పదవికి రాజీనామా చేసేవరకు వెళ్లింది. సౌతాఫ్రికా బౌలింగ్ దిగ్గజం అలెన్ డోనాల్డ్ కొన్నాళ్లుగా బంగాదేశ్ బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. అయితే మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదంపై తను చేసిన కామెంట్స్ బంగ్లాదేశ్ బోర్డుకి ఆగ్రహం తెప్పించింది.
ఇంతకీ తను ఏమన్నాడంటే…‘నేను అలాంటి నిర్ణయంతో షాక్ కి గురయ్యాను. బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి ప్రదర్శన నేను ఊహించలేదు‘ అని అన్నాడు. అప్పటికే వ్యవహారం మండిపోతోంది. అందరూ ఒక్కసారిగా బంగ్లాదేశ్ తీరుపై విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ షకీబ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. క్రీడాస్ఫూర్తికే ఇది విరుద్ధమని ఏకపక్షంగా తీర్పులు ఇచ్చేస్తున్నారు.
ఈ సమయంలో అలెన్ డోనాల్డ్ ఈ కామెంట్స్ చేయడంతో మండే మంటలో పెట్రోలు పోసినట్టయ్యింది. అధికారికంగా తమవాళ్లదే తప్పు అని చెప్పినట్టయ్యింది. ఇది జట్టుకు, మేనేజ్మెంట్ కు, బోర్డుకు ఆగ్రహం తెప్పించింది. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదనేది నీతి. అదే విధంగా డోనాల్డ్ వ్యవహరించాడు. తమ వాడిది తప్పు అని తెలిసిన తర్వాత ధర్మంగా చెప్పాల్సింది చెప్పాడు. కానీ ఈరోజుల్లో అది కాదు కదా కావల్సింది.
వాళ్లు తప్పు చేసినా సమర్థించాలి. ఇష్టం లేకపోతే నోర్మూసుకుని ఊరుకోవాలి. ఈ రెండు అలెన్ డోనాల్డ్ చేయలేదు. తప్పు చేసిన తమవారిని సమర్థించనూ లేదు. నోరు మూసుకుని ఊరుకోలేదు. దీంతో వ్యవహారం బోర్డు వరకు వెళ్లింది. వారు వివరణ అడిగారు. దాంతో డోనాల్డ్ కి వళ్లు మండింది. వెంటనే బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ‘ఇక్కడ నా పని ముగిసింది. ఇంటికి తిరిగి వెళుతున్నా’ అని చెప్పి విమానం ఎక్కీసినట్టు తెలిస్తోంది.
ఇంతకీ అలెన్ డోనాల్డ్ ఎవరంటే సౌతాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్. ఒకప్పుడు ఇతని బౌలింగ్ అంటే బ్యాటర్లకు వణుకు పుట్టేది. సన్నగా ఉండి, అత్యంత వేగంగా ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లు వేస్తూ బ్యాటర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.
ప్రస్తుతం 57 ఏళ్ల అలెన్ డోనాల్డ్ ఇండియన్ ఐపీఎల్ పుణె వారియర్స్ కి హెడ్ కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 1991-2003 మధ్య కాలంలో అంటే 12 ఏళ్లు సౌతాఫ్రికా క్రికెట్ కు సేవలందించాడు. టెస్టుల్లో 330, వన్డేల్లో 272 వికెట్లు మొత్తమ్మీద 602 వికెట్లు తీసుకున్నాడు. ఆ రోజుల్లో తన బౌలింగ్ యాక్షన్, అతను సంధించే బాల్స్ ఒక కొత్త ఒరవడికి నాంది పలికాయి. అందుకనే ఈ వయసులో కూడా ఎవరూ ఆయన్ని వదులుకోవడం లేదు. ఆయన సేవలను ఉపయోగించుకుంటున్నారు.
MallaReddy: రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి.. మాటల మంటలు..