Azhar Ali On Bhuvneshwar Kumar: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 సమయంలో ( ICC Champions Trophy, 2017) జరిగిన అరుదైన సంఘటనను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అజహార్ అలీ (Azhar Ali) గుర్తు చేశాడు. ఆ టోర్నమెంట్ సందర్భంలో టీమిండియాను ఓడిస్తామని భువనేశ్వర్ కుమార్ కు తన కొడుకు వార్నింగ్ ఇచ్చాడని బాంబు పేల్చాడు. భువనేశ్వర్ కుమార్ ను చూపిస్తూ.. రేపు మిమ్మల్ని ఓడించబోతున్నామంటూ ఎలాంటి భయం లేకుండా తన హెచ్చరించాడంటూ గుర్తు చేశాడు. ఇక తన కొడుకు చెప్పినట్టుగానే పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయిందని వెల్లడించాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ పై అజహార్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy, 2017) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs India, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా లండన్ లోని ప్రముఖ హోటల్ లో ఇరు జట్ల ప్లేయర్లు బస చేశారు. ఫైనల్ మ్యాచ్ కంటే ఒక రోజు ముందు భువనేశ్వర్ కుమార్ తో (Bhuvneshwar Kumar) పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అజహార్ అలీ అతని కొడుకు ఒకే లిఫ్టు లో ప్రయాణించారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ ను చూసి.. టీమిండియాను ఓడిస్తామని కొడుకు హెచ్చరించాడు.
దీంతో కంగు తిన్న భువనేశ్వర్ కుమార్.. ఏంటి ఆ బుడ్డోడు అలా అంటున్నాడు ? అని బిత్తరపోయాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన అజహర్ అలీ… అలా అనకూడదు.. టీమిండియాకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పాడు. క్రికెట్ లోనే రెండు జట్ల మధ్య పోటీ జరుగుతుందని.. దేశాల మధ్య సంబంధాలు పెరగాల్సిందేనని తన కొడుకుకు హితోపదేశం చేశాడు. ఇక్క ట్విస్ట్ ఏంటంటే, లిఫ్ట్ లో వార్నింగ్ ఇచ్చినట్టుగానే.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది.
పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐసీసీ చాంపియన్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లండన్ వేదికగా నిర్వహించగా మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 50 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ నాలుగు వికెట్లు నష్టానికి 338 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో అజహార్ అలీ 59 పరుగులు సాధించాడు. ఫకర్ జమాన్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయింది. 31 లో ఆడిన టీమిండియా 158 పరుగులకు అలౌట్ అయింది. దీంతో 180 పరుగులతో గెలిచిన పాకిస్తాన్ ఛాంపియన్ గా నిలిచింది.