BCCI Pay IPL Franchise| ఐపిఎల్ టోర్నమెంట్‌తో వేల, లక్షల కోట్ల ఆదాయం సంపాదిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక మాజీ ఐపిఎల్ జట్టుకు రూ.500 కోట్లకు పైగా చెల్లించాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కేరళకు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్‌కు బిసిసిఐ రూ.538 కోట్లు చెల్లించాలని బాంబే హై కోర్టు బుధవారం ఆదేశించింది. 2011లో కొచ్చి టస్కర్స్ ఒక సీజన్ మాత్రమే ఆడిన తర్వాత బిసిసిఐ ఈ జట్టును రద్దు చేసింది. ఒప్పందం ప్రకారం.. బ్యాంక్ గ్యారంటీ సకాలంలో సమర్పించలేదని ఆరోపిస్తూ BCCI ఈ జట్టును అప్పుడు తొలగించింది.
బొంబాయి హైకోర్టు బుధవారం తన తీర్పు వెలువరిస్తూ.. “ఆర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఈ కోర్టుకు ఉన్న అధికారం చాలా పరిమితం. బిసిసిఐ ఈ వివాదంలోని విషయాలను మళ్లీ పరిశీలించాలని ప్రయత్నించడం ఈ చట్టం పరిధికి విరుద్ధం. ఆర్బిట్రేషన్ తీర్పుపై BCCIకి అసంతృప్తి ఉండటం. దాన్ని సవాలు చేయడానికి కారణం కాదు.”
2015లో ఆర్బిట్రేషన్ తీర్పు.. కొచ్చి టస్కర్స్‌కు అనుకూలంగా రావడంతో బిసిసిఐ (BCCI)ని రూ. 550 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. ఇందులో కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 384 కోట్లు, రెండెజ్‌వస్ స్పోర్ట్స్‌కు రూ. 153 కోట్లు చెల్లించాలని తీర్పు వచ్చింది. ఈ తీర్పును BCCI కోర్టులో సవాలు చేసింది. అప్పటి ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఆర్బిట్రేషన్ కు వ్యతిరేకంగా చేసిన అప్పీల్ లో “మేము ఆర్బిట్రేటర్ లాహోటి నివేదికను పొందాము. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుల్లో ఎక్కువ మంది ఈ తీర్పుపై అప్పీల్ చేయాలని అభిప్రాయపడ్డారు. మేము లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నాము,” అని చెప్పారు.
కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీని 2010లో రూ. 1,550 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ, వార్షిక చెల్లింపు సమయానికి చేయడంలో విఫలమైన తర్వాత 2011లో BCCI వారి ఒప్పందాన్ని రద్దు చేసింది. కొచ్చి టస్కర్స్ యజమాన్యం.. BCCIపై కేసు వేసి గెలిచారు.. దీంతో కోర్టు BCCIని రూ. 550 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు బొంబాయి హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. అయితే చెల్లించాల్సిన మొత్తం రూ. 538 కోట్లుగా నిర్ణయించింది.
Also Read: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?..
కొచ్చి టస్కర్స్ ఆడిన ఏకైక 2011 ఐపీఎల్ సీజన్‌లో.. మొత్తం 10 జట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 14 లీగ్ మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు గెలిచింది. ఈ జట్టులో బ్రాడ్ హాడ్జ్, మహేల జయవర్ధనె, బ్రెండన్ మెక్‌కలమ్, రవీంద్ర జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆడారు. ఈ తీర్పు BCCIకి ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగించడమే కాక, ఫ్రాంచైజీలతో ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని గుణపాఠం ఇస్తుంది.