Ben Stokes: బెన్ స్టోక్స్ తెలుసుగా. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్నట్టు ఆడుతాడు. చిచ్చర పిడుగులా చెలరేగిపోతాడు. ఇంగ్లాండ్ తరఫున ఆడినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా బెన్ స్టోక్స్.. స్ట్రోక్ ప్లేయరే.
టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడా లేదు మనోడికి. కొట్టుడే కొట్టుడు. దంచుడే దంచుడు. అలా అలా ఫోర్లు, సిక్సులు బాదేస్తూ.. లేటెస్ట్ గా ఓ వరల్డ్ రికార్డు సైతం కొట్టేశాడు. అది కూడా టెస్టుల్లో.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు కొట్టి.. మెక్‌కల్లమ్ (107) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు బ్రెన్ స్టోక్స్. ప్రస్తుతం టెస్టుల్లో 109 సిక్స్‌లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
బెన్ స్టోక్స్ తర్వాతి స్థానంలో మెక్‌కల్లమ్ (107), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100) లు నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. ఇక టాప్-10లో భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91) ఒక్కడే నిలిచాడు.