Brian Laura : కౌంటీ క్రికెట్ లో 501 నాటౌట్ రికార్డ్, టెస్ట్ మ్యాచ్ ల్లో 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డ్ ని అధిగమించేవాళ్లు ఇండియన్ టీమ్ లో ఒకరున్నారని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అన్నాడు.
అతనే శుభ్ మన్ గిల్ అని చెప్పుకొచ్చాడు.
తన ఆట తీరు చూస్తే ముచ్చటేస్తుందని అన్నాడు.
ఇది రాసి పెట్టుకోండి, లేదా నా మాటలు గుర్తు పెట్టుకోండి, నా పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను శుభ్ మన్ గిల్ కి తప్ప మరొకరికి సాధ్యం కావని తేల్చి చెప్పాడు. బ్రియాన్ లారా మాటలతో గిల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారా మాట్లాడుతూ
పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణించే సత్తా శుభ్‌మన్ గిల్ కి మాత్రమే ఉందని కొనియాడాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లలో గిల్ ఒకరని చెప్పుకొచ్చాడు.
భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే సత్తా ఉన్నవాడు గిల్ మాత్రమేనని అన్నాడు. అంతే కాదు నాపేరిట ఉన్న అత్యంత శక్తివంతమైన రికార్డులనే కాదు, ఇంకా ఎన్నో రికార్డులను బద్దలు కొడతాడని తెలిపాడు. ఒకవేళ కౌంటీ మ్యాచ్ లు ఆడితే నేను చేసిన 501 పరుగులు కూడా దాటేస్తాడని తెలిపాడు.
వన్డేల్లో అప్పుడే డబుల్ సెంచరీ కూడా చేసేశాడని గుర్తు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఒంటిచేత్తో తన జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. 24 ఏళ్లే కాబట్టే భవిష్యత్తులో మరిన్ని ఐసీసీ టోర్నీలు గెలుస్తాడని తెలిపాడు.
మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. 9 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 354 పరుగులు చేశాడు. ప్రపంచకప్ ముందు సెంచరీల మోత మోగించి, కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో తడబడ్డాడు. అదే టీమ్ ఇండియాకు శాపమైంది. ప్రపంచకప్ అనంతరం విశ్రాంతీ తీసుకున్న గిల్.. సౌతాఫ్రికా పర్యటనతో మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.