Bronco Test : టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే యోయో, బ్రాంకో టెస్టుల్లో పాసయ్యేందుకు రోహిత్ శర్మ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తన ట్రైనర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్ సెషన్స్ లో చెమటోడ్చుతున్నాడు. ఎలాగైనా ఈ టెస్టులు నెగ్గాలనే కృతనిశ్చయంతో హిట్ మ్యాన్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్ శర్మ కు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ యోయో, బ్రాంకో టెస్ట్ నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో రోహిత్ శర్మ సెప్టెంబర్ 13న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కి రానున్నాడు. బెంగళూరులోని సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ )లో అతనికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
బ్రాంకో టెస్ట్ కి హాజరు కానున్న రోహిత్
వాస్తవానికి మే నెల చివర్లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తరువాత రోహిత్ శర్మ ఇప్పటివరకు మైదానంలోకి దిగలేదు. టెస్టు మ్యాచ్ ల నుంచి రిటైర్ అవ్వడంతో ప్రస్తుతం అతను ఖాళీగానే ఉన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ గత ఏడాదే టీ-20లకు కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ లో అతను బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో చాలా ముందుగానే ఫిట్ నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. గతంలో భారత క్రికెటర్ల ఫిట్ నెస్ పరీక్షించడానికి యోయో టెస్ట్ నిర్వహించిన బీసీసీఐ.. ఇప్పుడు సరికొత్తగా బ్రాంకో టెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ టెస్ట్ యోయో కంటే చాలా కఠినమైన ఫిట్ నెస్ పరీక్ష అని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాంకో ఫిటినెస్ పరీక్ష అంత మంచిది కాదని సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఆ టెస్ట్ తో ఊపిరితిత్తులు పాడైపోతాయి : డివిలియర్స్
“బీసీసీఐ నూతనంగా ప్రవేశపెట్టిన బ్రాంకో టెస్ట్ హెల్త్ పరంగా అంతగా మంచిది కాదు. వాస్తవానికి ఆ పరీక్ష గురించి మొదటి సారి చెప్పినప్పుడు అది ఎలా ఉండబోతుందో అర్థమైంది. అంతకంటే అర్థరహితమైన విషయం ఇంకొకటి ఉండదు. ప్రిటోరియా యూనివర్సిటీలో ఆ పరీక్షలో పాల్గొన్న రోజు నాకు గుర్తుంది. పెద్దగా ఆక్సిజన్ లేని ఎత్తైన ప్రదేశంలో పరుగెడుతుంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి అనిపించింది” అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
ఆసిస్ తో వన్డే సిరీస్ కోసం..
మరోవైపు టెస్టులు, టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. అక్టోబర్ లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, 5 టీ-20లు ఆడనుంది. అయితే ఆ సిరీస్ కోసం రోహిత్ సిద్ధమవుతున్నాడు. 2027 లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలన్నదే అతని లక్ష్యం. గత వరల్డ్ కప్ లో ఫైనల్ కి చేరిన కప్ కల మాత్రం నెరవేరలేదు. వన్డే వరల్డ్ కప్ ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో రోహిత్ శర్మ కొనసాగడం పై చర్చ జరుగుతోంది. టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం రోహిత్ కి ఆసిస్ తో జరిగే సిరీస్ లో అవకాశం కల్పించి.. అప్పుడు ఓ నిర్ణయానికి రావాలని చూస్తున్నట్టు సమాచారం.