
IPL Final Match 2023 CSK vs GT(Latest sports news today): వారెవ్వా.. ఏం మ్యాచ్. ఇది కదా ఐపీఎల్ ఫైనల్ అంటే. టైటిల్ కోసం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన హోరా హోరీ ఫైట్.. క్రికెట్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ను పెంచింది. నరాలు తెగే ఉత్కంఠతో చివరి బంతి వరకు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరికి ఐపీఎల్ కప్పు చెన్నైకే సలాం కొట్టింది. 5వ సారి కప్‌ను ముద్దాడి పాంచ్ పటాకా మోగించింది ధోని సేన. గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది.
చివరి ఓవర్లో జడేజా మెరుపులు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి. వరుణుడి దోబూచులాటలాడినా…చివరికి చెన్నై జట్టే ఈ సీజన్ ఐపీఎల్ కింగ్‌గా నిలిచింది. వరుసగా రెండో టైటిల్ సాధించాలన్న గుజరాత్ ఆశలపై చెన్నై నీళ్లు చల్లింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171రన్స్‌గా నిర్ణయించారు. సమిష్టి బ్యాటింగ్‌తో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఐపీఎల్-16 సీజన్ జగజ్జేతగా నిలిచింది ధోని సేన. చెన్నై విజయానికి చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. లాస్ట్ ఓవర్ వేసిన మోహిత్ శర్మ తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలింది రెండు బంతులే. చెన్నై గెలవాలంటే.. ఇంకా 10 పరుగులు కావాలి. స్ట్రైక్ జడేజా చేతిలో ఉంది. బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మ యార్కర్లతో చెమటలు పట్టిస్తున్నాడు. ఇక చెన్నై ఓటమి ఖాయం అనుకునే దశలో.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు జడేజా. ఐదో బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. దీంతో చెన్నై ఆశలు మళ్లీ చిగురించాయి.
లాస్ట్ బాల్‌కి నాలుగు పరుగులు కావాలి. దీంతో అందరిలో ఒక్కటే టెన్షన్. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతోపాటు టీవీలు చూస్తున్న వారు కూడా ఊపిరిబిగపట్టి చూస్తున్నారు. లాస్ట్ బంతిని ఫోర్ కొట్టిన జడేజా.. చెన్నై టీమ్‌ని గెలుపు సంబురాల్లో ముంచెత్తాడు. ఒక్కసారిగా స్టేడియం హోరెత్తింది. ఇక చెన్నై ఆటగాళ్లు అయితే పట్టరాని సంతోషంతో.. కేరింతలు కొడుతూ గ్రౌండ్ లోకి పరుగులు తీశారు. జడేజా కూడా విజయ గర్జనతో సెలబ్రేషన్స్ లో మునిగిపోయాడు. ధోని వైపు పరుగులు తీసి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. ధోని కూడా జడేజాను ఎత్తుకుని మరీ అభినందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్ మాత్రమే ఐదుసార్లు టైటిల్ గెలిచింది.
టాస్ గెలిచిన ధోని.. బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్లు సాహా 54 పరుగులు, గిల్ 39 రన్స్‌తో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. దీంతో చెన్నై ముందు 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.
చెన్నై లక్ష్య ఛేదనలో 3బంతులు పడ్డాయో లేదో వరుణుడు ప్రతాపం చూపాడు. రెండున్నర గంటలకు పైగా విరామం తర్వాత తిరిగి ఆట ప్రారంభమయ్యాక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 15 ఓవర్లలో 171గా సవరించారు. చెన్నై ఓపెనర్లు తొలి బంతి నుంచే విధ్వంసానికి దిగారు. ముఖ్యంగా కాన్వే చెలరేగిపోయాడు. కాన్వే 47, దూబె 32 పరుగులతో..చెన్నైకి గెలుపు బాటలు వేశారు. అయితే చెన్నైకి స్పిన్నర్ నూర్ అహ్మద్ చెక్ పెట్టాడు. అతను ఒకే ఓవర్లో చెన్నై ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. అయినా చెన్నై తగ్గలేదు. రహానె 27 పరుగులతో ఆ జట్టును ముందుకు నడిపించాడు. అతను ఔటయ్యాక మళ్లీ టైటాన్స్ పోటీలోకి వచ్చింది. 20 బంతుల్లో 51తో సమీకరణం చెన్నైకి సంక్లిష్టంగా మారింది. ఈ దశలో దూబె, రాయుడు ఆదుకున్నారు. రషీద్ బౌలింగ్‌లో దూబె వరుసగా రెండు సిక్సర్లు బాదితే.. మోహిత్ బౌలింగ్‌లో రాయుడు వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ బాదేయడంతో చెన్నై విజయానికి 15 బంతుల్లో 23 పరుగులే అవసరమయ్యాయి. కానీ మోహిత్ గొప్పగా పుంజుకున్నాడు. వరుస బంతుల్లో రాయుడు, ధోనిలను ఔట్ చేశాడు. అక్కడి నుంచి గుజరాత్ పట్టు బిగించింది. చివరి ఓవర్లో మోహిత్ తొలి నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో చెన్నై దాదాపుగా ఆశలు వదులుకున్నట్లే కనిపించింది. కానీ చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైన స్థితిలో జడేజా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
890 పరుగులతో ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక స్కోర్‌గా చేసిన శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అలాగే 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. చెన్నై ఓపెనర్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టుకు.. జై షా టైటిల్‌ను ప్రదానం చేశాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ధోని సూచనతో కప్‌ను అందుకున్నాడు. టైటిల్ ప్రైజ్‌మనీ కింద చెన్నై జట్టుకు 20 కోట్లు దక్కాయి. కప్ అందజేత కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్‌పై ధోని క్లారిటీ ఇచ్చారు. ఇంకో సీజన్ ఆడతానని.. ప్రేక్షకులకు శుభవార్త అందించాడు.