Ronaldo Retirement: ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇవ్వలేదు.. మరో మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం చేస్తామన్నారు. కోచ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జట్టు క్యాంప్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏకంగా 30 రోజుల సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు. ఇవన్నీ జరిగిన కొన్ని వారాలకే.. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 23 ఏళ్ల అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు ముగింపు పలికారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న రొనాల్డో.. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పోర్చుగల్ కోచ్‌కు, రొనాల్డోకు మధ్య ఏం జరిగింది? రిటైర్మెంట్‌కు ఈ వివాదమే కారణమా? లేక 41 ఏళ్ల వయసులో తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని రొనాల్డో ముందుగానే నిర్ణయించుకున్నారా?
ఫుట్‌బాల్ రారాజు రొనాల్డో గుడ్‌బై!
ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వాళ్లు ఉండరు. పోర్చుగల్ జాతీయ జట్టుకు దాదాపు 23 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో.. నవంబర్ 5న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలంటే సెప్టెంబర్ నెలలో జరిగిన సంఘటనలను పరిశీలించాలి. సెప్టెంబర్ 24న వేల్స్‌తో జరిగిన నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో రొనాల్డో పోర్చుగల్ తరఫున బరిలోకి దిగారు. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ ఒక గోల్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 27న నార్వేతో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాత్రం రొనాల్డోకు ఆడే అవకాశం రాలేదు. మ్యాచ్ మొత్తం బెంచ్‌పైనే కూర్చోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇక్కడి నుంచే అసలు వివాదం మొదలైంది. నార్వే మ్యాచ్‌లో రొనాల్డోను ఎందుకు ఆడించలేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
కోచ్ జార్జ్ జీసస్ కీలక ప్రకటన..
అయితే డెన్మార్క్‌తో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లోనూ రొనాల్డోను స్టార్టింగ్ లైనప్‌లోకి తీసుకోబోమని కోచ్ జార్జ్ జీసస్ ప్రకటించారు. దీంతో సెప్టెంబర్ 30న రొనాల్డో అనూహ్యంగా పోర్చుగల్ జట్టు ట్రైనింగ్ క్యాంప్ నుంచి వెళ్లిపోయారు. కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రొనాల్డో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే అప్పటికి అసలు వివాదం ఏంటన్నది పూర్తిగా బయటకు రాలేదు.
ఆగ్రహంతో క్యాంప్ వీడిన రొనాల్డో..
కొన్ని రోజుల తర్వాత రొనాల్డో స్వయంగా ఈ వివాదంపై స్పందించారు. కోచ్ జార్జ్ జీసస్ తనకు ఇచ్చిన మాటను రెండుసార్లు తప్పారని ఆరోపించారు. ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని నార్వే, డెన్మార్క్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు. కానీ నార్వేతో మ్యాచ్ జరిగిన రోజు.. 30 నిమిషాల పాటు ఆడిస్తానని కోచ్ చెప్పారట. దీంతో సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచే రొనాల్డో వార్మప్ చేశారు. కానీ మ్యాచ్ ముగిసే వరకు ఆయనను మైదానంలోకి పంపలేదు. ఇది తనకు ఇచ్చిన మాటను తప్పడమేనని రొనాల్డో భావించారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లోనూ కోచ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తమ మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలకు, కోచ్ మీడియా ముందు చెప్పిన విషయాలకు సంబంధం లేదంటున్నాడు రోనాల్డో. దీంతో మరిన్ని హామీల కోసం వేచి ఉండకుండా ట్రైనింగ్ క్యాంప్ నుంచి వెళ్లిపోయానని వివరించారు. అయితే ఇవన్నీ రొనాల్డో చేసిన ఆరోపణలే.
జట్టులోకి రావాలా వద్దా అన్నది రొనాల్డో నిర్ణయమే
కోచ్ మాత్రం రొనాల్డోతో విభేదాలున్నప్పటికీ ఆయనకు జాతీయ జట్టు తలుపులు మూసుకుపోలేదని క్లారిటీ ఇచ్చారు. తిరిగి జట్టులోకి రావాలా వద్దా అన్నది రొనాల్డో నిర్ణయమేనని చెప్పారు. ఆడినా ఆడకపోయినా రొనాల్డో జట్టుతో ఉండాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు.
రొనాల్డూ పై 30 రోజుల సస్పెన్షన్ వేటు..
అయితే ట్రైనింగ్ క్యాంప్ నుంచి వెళ్లిపోయిన వ్యవహారాన్ని పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. అక్టోబర్ 19న రొనాల్డూ పై 30 రోజుల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు 255 యూరోల జరిమానా కూడా విధించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఈ క్రమశిక్షణ చర్యలు ఎదురవడం మరింత చర్చకు దారితీసింది. అయితే రొనాల్డో తర్వాత తన చర్యపై క్షమాపణ చెప్పారు. శిక్ష పూర్తయిన తర్వాత కూడా జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కానీ ఈ వివాదం జరిగిన కొన్ని వారాలకే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
234 మ్యాచ్‌లు.. 146 గోల్స్..
2003లో కేవలం 18 ఏళ్ల వయసులో పోర్చుగల్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన రొనాల్డో.. ఆ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. పోర్చుగల్ తరఫున మొత్తం 234 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ చేశారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించారు. 2016లో పోర్చుగల్‌కు యూరో కప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. 2019, 2025 సంవత్సరాల్లో నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా సాధించారు. అంతేకాదు.. ఆరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొని, ప్రతి ప్రపంచకప్‌లోనూ గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2026 ప్రపంచకప్‌లోనూ మూడు గోల్స్ చేశారు. అయితే ఆ టోర్నమెంట్‌లో పోర్చుగల్ ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. అప్పుడే ఇదే తన చివరి ప్రపంచకప్ అని రొనాల్డో వెల్లడించారు.
భావోద్వేగానికి గురైన రొనాల్డ్..
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అందుకు కోచ్‌తో జరిగిన వివాదమే కారణమని ఎక్కడా నేరుగా చెప్పలేదు. అయితే రిటైర్మెంట్‌కు ముందు జరిగిన పరిణామాలు మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన రొనాల్డోకు.. తన కెరీర్ చివరి దశలో జట్టులో స్థానం గురించి వివాదం రావడం ఒక పరిణామం. మరోవైపు 41 ఏళ్ల వయసులో ఆటగాళ్ల ఫిట్‌నెస్, జట్టు అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని కోచ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ నిర్ణయాలను ఆటగాడికి ఎలా తెలియజేశారు? ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఏం జరిగింది? అన్నదే ఈ వివాదంలో కీలక అంశంగా మారింది. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా రొనాల్డో కూడా భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని నిర్ణయాలు కేవలం ఆలోచనలతో కాకుండా మనసుతో కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తన గోల్స్ వల్ల అభిమానులు సంతోషించి ఉంటే.. పోర్చుగల్ ప్రజలు తమ దేశం పట్ల గర్వంగా భావించి ఉంటే.. తన ప్రయాణం సార్థకమైనట్టేనని పేర్కొన్నారు.
పోర్చుగల్ జెర్సీలో ఇక కనిపించని CR7..
అయితే రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మాత్రమే గుడ్‌బై చెప్పారు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఆయన కెరీర్ కొనసాగనుంది. 23 ఏళ్ల ప్రయాణం.. 234 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 146 గోల్స్.. ఎన్నో రికార్డులు.. మరెన్నో విజయాలు.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న రొనాల్డో.. ఇప్పుడు పోర్చుగల్ జెర్సీకి వీడ్కోలు పలికారు. అయితే కోచ్‌తో వివాదం లేకపోయినా రొనాల్డో ఇదే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించేవారా?లేక ఆ వివాదమే ఆయన నిర్ణయాన్ని వేగవంతం చేసిందా? ఈ ప్రశ్నలకు రొనాల్డో నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం నిజం. పోర్చుగల్ జట్టులో రొనాల్డో ప్రస్థానం ముగిసినా.. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో CR7 పేరు మాత్రం నిలిచిపోతుంది.
Also Read: ముందు ఎమ్మెల్యేగా గెలువు.. ఆపై రాహుల్ గాంధీ మాట! జగ్గారెడ్డికి రఘునందన్ కౌంటర్