Inzamam ul Haq On Handshakes: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగాలేవన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తగ్గి పోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ (Handshake) కూడా టీమిండియా ప్లేయర్లు ఇవ్వడం లేదు. అంతే కాదు రెండుసార్లు ఆసియా కప్ కూడా మొహ్సిన్ నఖ్వీ నుంచి తీసుకోకుండా టీమిండియా తన దేశభక్తిని చాటుకుంది. ఇలాంటి నేపథ్యంలో గురువారం జరిగిన హాకీ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ను చిత్తు చేసి… ఆ జట్టు ఆటగాళ్లకు టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.
పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత హాకీ ప్లేయర్లు షేక్ హ్యాండ్ హై ఫై ఇవ్వడంపై ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత హాకీ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించాడు. ఇలాగే క్రీడాకారులు ముందుకు సాగాలని.. దేశాల మధ్య ఉన్న గొడవలను క్రీడాలకు ముడి పెట్టకూడదని కోరాడు. కానీ బీసీసీఐ మాత్రం షేక్ హ్యాండ్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యాడు. హకీ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బీసీసీఐకి ఏం రోగం? అంటూ నిలదీశాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదని చెబుతూ భారతీయులను బీసీసీఐ మోసం చేస్తోందని నిప్పులు చెరిగాడు. భారతీయుల సెంటీమెంట్ తో బీసీసీఐ పెద్దలు ఆడుకుంటున్నారని సీరియస్ అయ్యాడు.హాకీ ప్లేయర్ల తరహాలోనే టీమిండియా క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.
భారత హాకీ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ముందు సరికొత్త ప్రతిపాదన తీసుకువచ్చాడు ఇంజమామ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవలను వదిలేసి రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించాలని కోరాడు. ఇండియాకు వచ్చేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని… అదే సమయంలో తమ దేశానికి టీమిండియా రావాల్సిందేనని తెలిపాడు.
గతంలో లాగా పాకిస్తాన్ కు ఇండియా వస్తే గుండెల్లో పెట్టుకొని చూస్తామని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్, శ్రీలంక ప్లేయర్లు పాకిస్తాన్ పర్యటనను ఎంజాయ్ చేశారని.. అంతకు మించి ఏర్పాట్లను టీం ఇండియాకు చేస్తామని హామీ ఇచ్చాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగితే కోట్లల్లో ఆదాయం రావడం గ్యారెంటీ అన్నాడు. దీని వల్ల తమతో పాటు బీసీసీఐకి కూడా లాభం జరుగుతుందని సూచనలు చేశాడు. దీనికి ఉదాహరణ వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో 34వేల సీట్ల కోసం కోటి మంది వరకు దరఖాస్తులు చేసుకోవడమేనని గుర్తు చేశాడు.