IPL 2024 49th Match – Chennai Super Kings Vs Punjab Kings Highlights: ఐపీఎల్ ప్రారంభంలో మొదట్లో కొన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఇక చివర్లో ప్రాణం మీదకి వచ్చిన తర్వాత వరుసగా గెలుస్తూ పంజాబ్ కింగ్స్ ముందుకెళుతోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి, వారి దూకుడికి కళ్లెం వేసింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి ఎగబాకింది.
చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నయ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కి ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. ప్రభసిమ్రాన్ సింగ్ (13) అవుట్ అయిపోయాడు. బ్యాటింగ్ చాలా కష్టంగా సాగే దశలో మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో మాత్రం ఒకవైపున అలా స్టాండ్ అయి ఉండిపోయాడు. మొత్తానికి 30 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Also Read: రిషబ్ పంత్ ఎంపిక వెనుక.. దాగిన కఠోర శ్రమ..
తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన రిలీ రొసోవ్ ధనాధన్ ఆడాడు. 23 బంతుల్లో 2 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ సింగ్ (25 నాటౌట్), కెప్టెన్ శామ్ కర్రన్ (26 నాటౌట్) ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 17.5 ఓవర్లలో 163 పరుగులు చేసి జట్టుని విజయతీరాలకు చేర్చారు.
చెన్నై బౌలింగులో శార్దూల్ ఠాకూర్ 1, రిచర్డ్ గ్లెసన్ 1, శివమ్ దుబె 1 వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కి పిచ్ నుంచి అస్సలు సహకారం అందలేదు. బ్యాటర్లకి బాల్ అస్సలు కనెక్ట్ కాలేదు. ఇంతకుముందు విధ్వంసం సృష్టించిన ఆటగాళ్లు వీళ్లేనా? అన్నట్టు ఆడారు. ఓపెనర్ ఆజ్యింకా రహాన్ (29) ఎప్పటిలా తక్కువ స్కోరుకి అవుట్ అయ్యాడు.
మరో ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదే ఫామ్ తో ఆడుతూ 48 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వీటిలో 2 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్ కి ఎంపికైన శివమ్ దుబె.. బహుశా ఆ ఆనందంలో గోల్డెన్ డక్ అవుట్ అయిపోయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Kavya Maran Jumps In enjoy SRH win: అప్పటివరకు టెన్షన్.. విజయం తర్వాత కావ్యమారన్ ఎగిరి..
తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (2) వెంటనే వెళ్లిపోయాడు. తను కూడా వరల్డ్ కప్ జట్టులో ఉన్నాడు. ఇక్కడే చెన్నై మ్యాచ్ టర్న్ అయ్యింది. తర్వాత వచ్చిన వాళ్లు వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా బాల్ టు బాల్ సింగిల్స్ తీసుకుంటూ వెళ్లారు. అలా సమీర్ రిజ్వి (21), మొయిన్ ఆలి (15), ఎంఎస్ ధోనీ (14) ఇలా మమ అనిపించారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నయ్ 162 పరుగులు చేసింది.
పంజాబ్ బౌలింగులో రబాడ 1, హర్ ప్రీత్ 2, రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక్కడ కూడా టీ 20 వరల్డ్ కప్ కి ఎంపికైన అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో అత్యధికంగా 52 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీశాడు.