T20 World Cup 2024: ఆరోజు డిసెంబర్ 30, 2022 న్యూ ఇయర్ వేడుకలకు రెండురోజుల ముందు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. అద్రష్టవశాత్తూ తను బతికి బట్టకట్టాడు. తీవ్ర గాయాలపాలైన పంత్ ని ఆసుపత్రికి చేర్చారు. మొత్తానికి బతకడమే కష్టం అనుకునే పరిస్థితి నుంచి, తర్వాత నడవడమే కష్టమనే పరిస్థితి నుంచి, తిరిగి మళ్లీ క్రికెట్ ఆడటమే కష్టమనే పరిస్థితి నుంచి.. ఒకవేళ ఆడినా వికెట్ కీపర్ గా పనిచేయడనే పరిస్థితి నుంచి.. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఆ 26 ఏళ్ల కుర్రాడు రిషబ్ పంత్ ఎదిరించి నిలిచాడు. తనకి క్రికెట్ పై ఎంత ప్రేమ ఉందో నిరూపించాడు.
ఇప్పుడు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉండటమే కాదు.. ఇటు వికెట్ కీపర్ గా , అటు బ్యాటర్ గా అద్భుతంగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. ఈ రోజున అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే తను జాతీయ జట్టుకి ఎంపిక కావడమే కాదు, టీ 20 ప్రపంచ కప్ లో ఆడే 15 మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.
ఎలాంటి పరిస్థితుల నుంచి తిరిగి జాతీయ జట్టుకి రిషబ్ పంత్ ఎంపికయ్యాడంటే ఆశ్చరమనిపిస్తుంది. అయితే దీని వెనుక తను చేసిన తీవ్రమైన కఠోరమైన శ్రమ ఉంది. తనకెంత ప్రమాదం జరిగినా ఒక పాజిటివ్ ఆలోచనలతో ముందడుగు వేశాడు. ఏనాడూ నిరాశ నిస్ప్రహలకు లోను కాలేదు. అసలే తను బొద్దుగా ఉంటాడు. తర్వాత మంచమ్మీదే ఉండటం వల్ల బరువు పెరిగిపోయాడు. దీంతో తన బరువును తగ్గించుకునేందుకు నోరు కట్టీసుకున్నాడు.
చాలా కఠినమైన డైట్ తీసుకున్నాడు. తనకిష్టమైన చికెన్, రసమలై, బిర్యానీకి దూరంగా ఉన్నాడు. అలాగే చిల్లీ చికెన్ కూడా కేవలం 5 ఎంఎల్ ఆలివ్ ఆయిల్ తో తయారు చేసుకుని తిన్నాడు. రాత్రి 9 గంటలకు పడుకునేవాడు. పొద్దున్నే 4 గంటలకు లేచేవాడు. 8 గంటల నిద్ర ఉండేలా చూసుకున్నాడు.
చాలా సిస్టమేటిక్ గా మారిపోయాడు. అలా ఐపీఎల్ లోకి వచ్చేసరికి సుమారు 16 కేజీల బరువు తగ్గాడు. తను తిరిగి రీ ఎంట్రీ కావడంపై పలువురు క్రీడాకారులు, అభిమానులు, ప్రజలు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజంగా రిషబ్ పంత్ అభినందనీయుడని కొనియాడుతున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అంటున్నారు.
Also Read: ఆ ఐదుగురికి.. ఆఖరి టీ20 ప్రపంచకప్ ఇదేనా?
మ్యాచ్ ని ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో మార్చగల దమ్మున్న ఆటగాడిగా రిషబ్ పంత్ కి పేరుంది. అదే తనని ప్రపంచకప్ నకు ఎంపిక చేసింది. మరి మనం కూడా శభాష్ రిషబ్ పంత్ అందాం. అలాగే తనకి ఆల్ ది బెస్ట్ చెబుదాం.