Deepthi Jeevanji Parents Gets Emotional After Her Winning in paralympics 2024: పారాలింపిక్స్ లో ప్రతి ఒక్కరి వెనుక ఎన్నో దయనీయ గాథలు…కానీ విజేతలు అయినవాళ్లవే ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. తెలుగమ్మాయి దీప్తి జీవాంజి తొలిసారి కాంస్య పతకం సాధించి.. తెలుగువారి ఘనతను చాటి చెప్పింది. అంతేకాదు పారాలింపిక్స్ లో పతకం సాధించిన తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకుంది.
నిజానికి దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. ఆమె తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మీ ఇద్దరు కూడా కుమార్తె పట్ల అపారమైన నమ్మకంతో ఉండేవారు. ఏనాడు వారు తమ ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. కుమార్తెను ప్రోత్సహిస్తూనే వచ్చారు.
ఈరోజు దీప్తి పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం వెనుక ఆ తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. వీరిది కడు నిరుపేద కుటుంబం. అంతేకాదు దీప్తికి మానసిక వైకల్యం కూడా తోడవడంతో వారు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా తమ కుమార్తెకు మంచి జరగాలనే ఉద్దేశంతో, తమకి ఉన్న ఏకైక ఆధారం.. ఎకరం పొలాన్ని అమ్మేశారు. ఇక జీవనాధారం కోసం రోజు పనుల్లోకి వెళ్లేవారు. అలా ఎంతో కష్టపడి కుమార్తెను ఈ స్థాయికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా దీప్తి తండ్రి మాట్లాడుతూ మేం ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నామని అన్నాడు. మా అమ్మాయికి ఏదొక పతకం రావాలని మేం ఆశపడ్డాం. నిజానికి రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మా అమ్మాయి పోటీ పడే రోజున కూడా ఇంటి దగ్గర లేను. పనికి వెళ్లాను. అక్కడ నుంచి తిరిగివస్తూ.. మా అమ్మాయి పతకం సాధిస్తే చూడాలనుంది అని స్నేహితులతో చెప్పాను.
Also Read: పారాలింపిక్స్.. 20 పతకాలతో భారత్ జోరు
అంతేకాదు అందరితో సంబరాలు చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. నిజంగా పతకం సాధించిందని తెలియగానే ఎనలేని ఆనందం కలిగింది. నిజానికి పతకం కోసం రాత్రి పగలు తనెంతో కష్టపడిందని కన్నీళ్లతో చెప్పాడు.
అనంతరం దీప్తి తల్లి లక్ష్మీ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురైంది. చిన్నప్పుడు తనని అందరూ హేళన చేసేవారు. ఎగతాళి చేసేవారు. ఇప్పుడీ స్థాయికి రావడంతో అందరూ అభినందిస్తున్నారని తెలిపింది. చిన్నప్పుడు తన తల చాలా చిన్నగా ఉండేది. పెదాలు, ముక్కు అసాధరణంగా ఉండేవి. తనని పిచ్చిదన్నారు. అనాధ శరణాలయంలో చేర్చమని అన్నారు.
కానీ మేం, మా కుమార్తె కోసం కష్టపడ్డాం. ఈ రోజు తను భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు సాధించిందని తెలిపింది. తన కోసం నేను, వాళ్ల నాన్న, చెల్లి అమూల్య కూడా పనుల్లోకి వెళ్లి కష్టపడేదని గుర్తు చేసుకుంది. మొత్తానికి మా అందరి కష్టం ఫలించిందని సంతోషంతో తెలిపింది.