WPL 2024 Final Match Highlights: మహిళా ప్రిమియర్ లీగ్ రెండో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. గతేడాది ఫైనల్ లో ఓడిన ఢిల్లీ ఈసారైనా కప్పు కొట్టాలన్న కసితో ఉంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన బెంగళూరు .. ఈసారి పట్టుదలతో ఆడింది. కొన్ని వైఫల్యాలు ఎదురైనా కష్టపడి ఫైనల్ కు చేరింది.
పురుషుల ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగళూరు జట్లు టైటిల్ గెలవలేదు. అయితే మహిళ జట్టు ఆ లోటు తీర్చబోతోంది. మరి ఢిల్లీకి గెలుస్తుందా? బెంగళూరు టైటిల్ కైవసం చేసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు అద్భుతంగా ఆడుతోంది. లీగ్ దశలో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్ ల్లోనే ఓడింది. దీంతో నేరుగా తుది పోరుకు అర్హత సాధించింది.
ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్, ఓపెనర్ షెఫాలీ వర్మ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ జెమీమా రోడ్రిగ్స్, అలీస్ క్యాప్సీ అదరగొడుతున్నారు. మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిని అడ్డుకోవడం బెంగళూరుకు అంత వీజీ కాదు. ముఖ్యంగా జెమీమా సూపర్ ఫామ్.. ఆర్సీబీని కలవర పెడుతోంది. ఆమె క్రీజు ఉంటే విధ్వంసమే సృష్టిస్తోంది. ఎలాంటి బౌలర్ నైనా ఊచకోత కోస్తోంది. షెఫాలీ వర్మ హిట్టింగ్ గురించి ప్రత్యేక చెప్పాల్సి పనిలేదు. తొలి బంతి నుంచే ఆమె దూకుడుగా ఆడుతుంది. మెగ్ లానింగ్ నిలకడ ఢిల్లీకి అదనపు బలం. ఢిల్లీ బౌలింగ్ లోనూ బలంగానే ఉంది. మరిజేన్ కాప్, జోనాసెన్ , రాధ యాదవ్ రాణిస్తున్నారు.
Also Read: ఐపీఎల్ లో కొనుగోలు చేయకపోయినా బాధ లేదు: ముషీర్ ఖాన్
ఆర్సీబీ లీగ్ దశలో పడుతూ లేస్తూ ముందుకెళ్లింది. నాలుగు మ్యాచ్ ల్లో గెలిచిన బెంగళూరు.. మరో నాలుగింటిలో ఓడింది. గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఎలిమినేటర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో తలబడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి ముంబైకి షాకిచ్చింది.
స్మార్ట్ బ్యాటర్ స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు బలంగానే ఉంది. అయితే సమిష్టి ప్రదర్శన అన్ని మ్యాచ్ ల్లోనూ చేయకపోవడం మైనస్ పాయింట్ గా మారింది. ఎలీస్ పెర్రీపైనే ఈ టీమ్ ఎక్కువగా ఆధారపడింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ పెర్రీనే కీలకంగా ఉంది. స్మృతి మంధాన, కీపర్ రిచా ఘోష్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు.
ఆర్సీబీ జట్టులో మంచి బౌలర్లు ఉన్నా ఈ సీజన్ లో చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఆశ, సోఫీ మెలనూ మాత్రమే కాస్త నిలకడగా వికెట్లు తీస్తున్నారు. వేర్ హామ్, రేణుక, శ్రేయాంక పాటిల్ కూడా బౌలింగ్ లో సత్తా చాటితే ఢిల్లీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఫైనల్ లో ఢిల్లీ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. బెంగళూరు సంచలన ప్రదర్శన చేస్తే కప్ కైవసం చేసుకుంటుందనే అంచనా ఉంది.